ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్

ప్రపంచంలో ఆరో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది భారత్. గతంలో ఆరో స్థానంలో ఉన్న ఫ్రాన్స్‌ నేడు ఏడో స్థానానికి చేరింది. గత ఏడాది చివరి నాటికి మన దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 2.597 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోగా, ఫ్రాన్స్ జీడీపీ 2.582 లక్షల కోట్ల డాలర్లుగా నమోదు అయింది. అనేక త్రైమాసికాల తర్వాత జూలై 2017 నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకొంది. అయితే ఫ్రాన్స్ జనాభా మన దేశ జనాభాతో పోల్చితే చాలా తక్కువగా ఉండడంతో తలసరి జీడీపీ 20 రెట్లు అధికంగా ఉందని ప్రపంచ బ్యాంకు గణాంకాలు తెలిపాయి. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు కారణంగా కుంటుపడిన దేశ ఆర్థిక వ్యవస్థ ఆ తర్వాత ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు భారీగా పెరగడం, వినియోగ వస్తువుల కొనుగోళ్లు ఊపందుకోవడంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి దోహద పడిందని పేర్కొంది ప్రపంచబ్యాంక్. గత దశాబ్ద కాలంలో దేశ జీడీపీ రెట్టింపు అయింది. చైనా ఆర్థిక వ్యవస్థ మందగించినప్పటికీ ఆసియాలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. పన్ను సంస్కరణలు, కన్జ్యూమర్ వ్యయాలతో ఈ ఏడాది దేశ జీడీపీ 7.4 శాతం, 2019లో 7.8 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది ఐఎంఎఫ్.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.9 శాతం వృద్ధి చెందుతుందని చెపుతుంది ఐఎంఎఫ్. 2019 సంవత్సరాంతానికి బ్రిటన్, ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థలను ఇండియా అధిగమిస్తుందని, 2032 నాటికి ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని గతంతో లండన్‌కు చెందిన సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ బిజినెస్ రీసెర్చి తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం బ్రిటన్ 2.622 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా వుంది. మొదటి స్థానంలో అమెరికా, రెండో స్థానంలో చైనా, మూడో, నాలుగో స్థానాల్లో జపాన్, జర్మనీ దేశాలు కొనసాగుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates