ఆర్టీసీకి సీఎం వార్నింగ్:  సమ్మెకు వెళ్తే ఉద్యోగాలు ఊడతాయి

kcrఆర్టీసీ ఉద్యోగులు ఇచ్చిన సమ్మె పిలుపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. వెంటనే సమ్మె విరమించుకోవాలని ఆదేశించారు. లేకపోతే ఉద్యోగాలు తీసేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ యూనియన్లు కోరుతున్నట్లు డిమాండ్లను అమలు చేయడం సాధ్యం కాదన్నారు. సంస్థను లాభాల్లోకి తెస్తామన్న హామీ ఏమైందని కార్మిక సంఘాలను ప్రశ్నించారు.  ఇప్పటికిపుడు సమ్మెకు పోతే ఇపుడున్న అప్పుకు తోడు నష్టాలు మరింతగా పెరుగుతాయన్నారు. ప్రస్తుతం ఆర్టీసీకి 3 వేల కోట్ల అప్పు ఉందనీ, దీనికి నెలకు 250కోట్ల వడ్డీలే కడుతున్నామన్నారు.ఆర్టీసీ యూనియన్లు ఇచ్చిన సమ్మె నోటీసు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మంత్రులు, అధికారులతో ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి. మరోవైపు ఇవాళ కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించింది ప్రభుత్వం

వేతన సవరణ కోరుతూ ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన సమ్మెపిలుపును తప్పుబట్టారు సీఎం కేసీఆర్.  ఇప్పటికిపుడు సమ్మెకు పోతే ఇపుడున్న అప్పుకు తోడు నష్టాలు మరింతగా పెరుగుతాయని, వెంటనే కార్మికులు సమ్మెను వెనక్కు తీసుకోవాలని ఆదేశించారు. యూనియన్ నాయకులు అమలు సాధ్యం కాని కోరికలు కోరుతున్నారనీ అన్నారు. ఆర్టీసీకి ఇపుడు 3 వేల కోట్ల అప్పు ఉందనీ, దీనికి నెలకు 250కోట్ల వడ్డీలే కడుతున్నామన్నారు. ఇపుడు కోరుతున్న డిమాండ్లు పరిష్కరించాలంటే అదనంగా ఏడాది 7 వందల కోట్లు అవసరమవుతాయన్నారు. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం కానీ ఆ భారం మోసే పరిస్థితిలో లేవన్నారు.దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ పెంచని విధంగా ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను 44 శాతం మేర పెంచి..నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లో నడిపించాలని చెప్పినా ఫలితం మాత్రం శూన్యమన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు నోటీసు ఇవ్వడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని తెలిపారు. ప్రభుత్వ సూచనను కాదని సమ్మెకు వెళితే ఉద్యోగాలు తీసేయక తప్పదని హెచ్చరించారు. ఉద్యోగాలు వద్దనుకునే వారే సమ్మెలో పాల్గొనాలన్నారు.

రాష్ట్రంలో మొత్తం 96 డిపోలుంటే 2016లో 9 మాత్రమే లాభాల్లో నడుస్తున్నాయనీ. రెండేళ్ల తర్వాత ఇప్పటికీ కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. దేశంలో చాలా రాష్ర్టాల్లో ఆర్టీసీ కార్పొరేషన్లు ఎత్తివేయడమో..నామ మాత్రంగా నడపడమో లేదా పునర్ వ్యవస్థీకరించడమో జరిగిందన్నారు. తమిళనాడులో 10 ఆర్టీసీలు, కర్నాటకలో 4, మహారాష్ట్రలో 7, ఇలా ప్రతీ రాష్ట్రంలో ఆర్టీసీని విభజించారన్నారు. ఇదే పద్ధతిని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాల్సిన పరిస్థితి రావచ్చని చెప్పారు.

యూనియన్లు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాకుండా…సంస్థ పరిస్థితిపై సమీక్ష చేసుకుని ఆర్గనైజేషన్ ను ఎలా లాభాల బాట పట్టించాలో ఆలోచన చేయాలన్నారు. యూనియన్ నాయకులు తమ మనుగడ కోసం కార్మికుల కుటుంబాలను ఇబ్బందికి గురిచేయడం మంచిది కాదని చెప్పారు సీఎం. యూనియన్ నాయకులు ఆర్టీసీని మొత్తమే ముంచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నాయకుల మాటలు విని కార్మికులు మోసపోవద్దని సూచించారు సీఎం.

కార్మికులు సమ్మెకంటూ పోతే టీఎస్ ఆర్టీసీ చరిత్రలో ఇదే చివరి సమ్మెగా మిగిలిపోతుందన్నారు సీఎం. తెలంగాణ రాష్ట్రం అంటే నాలుగు కోట్ల మంది ప్రజలనీ,  కేవలం 53 వేల మంది ఆర్టీసీ కార్మికులు మాత్రమే కాదన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పెంచాలంటే బస్సు చార్జీలు కూడా పెంచాలనీ, కానీ ప్రజలపై భారం మోపే పనులకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని చెప్పారు సీఎం.

మరోవైపు సమ్మెపై శుక్రవారం(జూన్-8) కార్మికులతో చర్చించనుంది సర్కార్. కార్మిక సంఘాల నేతలు, జేఏసీతో మంత్రి మహేందర్ రెడ్డి చర్చలు జరపనున్నారు. సమ్మె విరమించాలని కోరనున్నారు.

Posted in Uncategorized

Latest Updates