ఆర్మూర్ మున్సిపాలిటీ అరుదైన రికార్డు

ARMOORనిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. పన్నుల వసూళ్లలో ప్రథమ స్థానంలో నిలిచింది. 2016-17 ఆర్ధిక సంవత్సరం 99.69 శాతం పన్నులు వసూలు కాగా… ఈ సంవత్సరం 100 శాతం వసూలు చేసి రాష్ట్రంలో ఉత్తమ మున్పిపాలిటీగా నిలిచింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ  చరిత్రలో మొదటి సారిగా ఆర్ధిక సంవత్సరం ముగిసే లోపు వంద శాతం ఇంటిపన్ను వసూలు చేసి రికార్డును సృష్టించింది.

పన్నుల చెల్లింపుపై మున్సిపల్ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తూ వంద శాతం పన్నుల వసూలును పూర్తి చేశారు. 2006 లో ఆర్మూర్ పంచాయతిని మున్సిపాలిటిగా మార్చారు. అప్పటి నుంచి వందశాతం పన్నుల వసూలు పూర్తి చేయడం ఇదే మొదటి సారి. దీంతో రాష్ట్రంలోని 72 మున్సిపాలిటిల్లో ఉత్తమ మున్సిపాలిటీల సరసన ఆర్మూర్ మున్సిపాలిటీ చేరింది. ఆర్మూర్ పట్టణంలోని 10 వేల 678 ఇళ్లపై 2017 -18 ఆర్ధిక సంవత్సరానికి పన్నుల రూపంలో కోటి 79 లక్షల 61 వేల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. గతేడాది 2016- 17 ఆర్ధిక సంవత్సరంలో 99.69 శాతం పన్నులు వసూలు చేశారు.  ఈ ఏడాది దాన్ని 100 శాతం పూర్తి చేయాలని పక్కా ప్లాన్ చేశారు. మున్సిపల్  ఆఫీస్  ప్రాంగణంలో పన్నుల వసూలుకు ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేశారు.

దీంతో ఈ మార్చి 30 నాటికి రాష్ట్రంలోని 72 మున్సిపాలిటీలో ఆర్మూర్ మున్సిపాలిటీ పన్నుల వసూలు లో మూడో స్ధానంలో నిలిచింది. నెలాఖరుకు వంద శాతం పన్నుల వసూలు పూర్తి చేసి రికార్డును కైవసం చేసుకున్నారు. మున్సిపల్ సిబ్బంది, పాలకమండలి కృషి తోనే ఈ రికార్డు సాధ్యమైందన్నారు మున్సిపల్ కమిషనర్ శైలజ. వంద శాతం పన్ను వసూళ్లు సాధించడం సంతోషంగా ఉందన్నారు మున్సిపల్ చైర్ పర్సన్ స్వాతి సింగ్. ప్రజల సహకారంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామంటున్నారు. పన్నుల వసూళ్లపై చూపించిన శ్రద్ద అభివృద్ధి పనులపైనా చూపించాలంటున్నారు పట్టణ వాసులు.

Posted in Uncategorized

Latest Updates