ఆలేరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మోత్కుపల్లి నర్సింహులు

యాదాద్రి: మాజీమంత్రి,  టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని చెప్పారు. రేపు(సెప్టెంబర్ 27) యాదగిరిగుట్టలో “మోత్కుపల్లి శంఖారావం” సభ నిర్వహించి  ప్రజల్లోకి వెళ్తానన్నారు. ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జలాలు సాధించడమే తన అంతిమ లక్ష్యం అన్నారు. తాను రాజకీయ నాయకుడిని కాదని.. ప్రజాసేవకుడినని చెప్పుకున్నారు మోత్కుపల్లి. ఆలేరు ప్రజల కోరిక మేరకే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని.. తన జీవితానికి ఇవే చివరి ఎన్నికలు అని చెప్పారు మోత్కుపల్లి నర్సింహులు.

మోత్కుపల్లి నర్సింహులు టీడీపీ సీనియర్ నాయకుడిగా ఆ పార్టీకి సుదీర్ఘకాలం సేవ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగానూ పనిచేశారు. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తనను రాజ్యసభకు పంపాలనీ.. లేదా గవర్నర్ పోస్టు ఇప్పించాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు విజ్ఞప్తిచేశారు. ఆయన విజ్ఞప్తికి సమాధానం రాకపోవడంతో… పలు వేదికల్లో చంద్రబాబుపై బహిరంగ విమర్శలు చేశారు. మహానాడుకు, తెలంగాణ టీడీపీ సమావేశాలకు ఆయనకు పిలుపు రాకపోవడంతో మనస్తాపం చెందిన మోత్కుపల్లి… ఇటీవల టీడీపీని వీడారు.

Posted in Uncategorized

Latest Updates