ఆవిర్భావ సంబురాలకు అంతా సిద్ధం: స్కూళ్లు,ఆఫీసుల్లో జెండా వందనం

TSరాష్ట్ర ఆవిర్భావ సంబురాలకు అంతా సిద్ధమైంది. రేపు అన్ని స్కూళ్లలో జెండా వందనం నిర్వహిస్తారు. రాష్ట్ర చరిత్రను చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు. పరేడ్ గ్రౌండ్స్ లో  సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రగతిని ప్రజలకు వివరిస్తారు.

తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా వందనం కార్యక్రమం నిర్వహించనున్నారు. హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు జెండా ఆవిష్కరణ చేస్తారు.

రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందున్న గన్ పార్క్ లో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తారు సీఎం. తర్వాత బేగంపేటలో పోలీస్ అమరవీరుల స్థూపం దగ్గర శ్రద్ధాంజలి అర్పిస్తారు. పదిగంటల 25 నిమిషాలకు పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటారు. పదిన్నరకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. దాదాపు 13 నిమిషాల పాటు పోలీస్ మార్చ్ పాస్ట్ ఉంటుంది. ఉత్తమ ప్రతిభ చూపిన అధికారులకు బహుమతుల ప్రదానం తర్వాత… సీఎం కేసీఆర్ 11గంటలకు ప్రసంగిస్తారు.

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా.. రేపు ఉదయం 9 గంటల నుంచి.. 12 గంటలవరకు పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు పోలీసులు. నాలుగంచెల బందోబస్తు ఏర్పాటు చేశామన్న పోలీసులు.. వేడుకలకు 20వేల మంది వస్తారని అంచనావేస్తున్నారు.

తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో.. రవీంద్రభారతి, పీపుల్స్ ప్లాజా, లుంబినీ పార్క్ లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పీపుల్స్ ప్లాజాలో మూడురోజుల ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఎల్లుండి సాయంత్రం లుంబిని పార్క్ నుంచి.. పీపుల్స్ ప్లాజా వరకు వెయ్యి మంది కళాకారులతో.. కల్చరల్ కార్నివాల్ నిర్వహించనున్నారు. బైసన్ పోలో గ్రౌండ్స్ లో 3రోజుల పాటు పారామోటరింగ్ నిర్వహిస్తారు. స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో పదిరోజుల ఆల్ ఇండియా ఆర్ట్ కాంపిటీషన్  అండ్ ఎగ్జిబిషన్ ను మంత్రి చందూలాల్ ప్రారంభించారు.  ఢిల్లీలోనూ మూడు రోజుల పాటు స్పెషల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. ఉదయం ఇండియాగేట్ వరకు త్రీకే రన్ నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీ, సెక్రటేరియట్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, గోల్కొండ, చార్మినార్ సహా… చారిత్రక, పర్యాటక ప్రాంతాలు, కూడళ్లను ప్రత్యేకంగా అలంకరించారు. రాత్రిపూట కళ్లు జిగేల్మనిపించేలా లైటింగ్ ఏర్పాట్లు చేశారు.

Posted in Uncategorized

Latest Updates