చిన్నారులను కాపాడబోయి..! ఆస్ట్రేలియా బీచ్ లో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌ వేల్స్‌లో జరిగిన పడవ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. సముద్రంలో పడిపోయిన ముగ్గురు… చిన్నారులను కాపాడేందుకు నీళ్లలో దూకి.. ప్రమాదం బారినపడ్డారు. ముగ్గురు చిన్నారులను అక్కడున్న సేఫ్టీ టీమ్ కాపాడింది. ఐతే.. నీళ్లలో మునిగిపోయిన ముగ్గురిలో ఇద్దరు మృతదేహాలను వెలికితీశారు. మరొక వ్యక్తి కోసం గాలిస్తున్నారు. సోమవారం జరిగిన ఈ సంఘటనలో మూడో వ్యక్తి కూడా చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు.

మృతులను నల్గొండ జిల్లా మన్యం చెల్కకు చెందిన గౌసుద్దీన్(45), అతని అల్లుడు జునేద్(28), హైదరాబాద్ BHELకు చెందిన రాహత్(35)గా గుర్తించారు. వీరిలో గౌసుద్దీన్, రాహత్‌‌ల మృతదేహాలు దొరికాయి. జునేద్ మృతదేహం కోసం గాలిస్తున్నారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం… సిడ్నీ, బ్రిస్బేన్ నగరాల్లో ఉంటున్న రెండు తెలుగు కుటుంబాలు …. హాలీడే ట్రిప్ కోసం మూనీ బీచ్ కు వెళ్లాయి. అక్కడి కాఫ్స్ హార్బర్ లో సరదాగా గడిపేందుకు ప్లాన్ చేసుకున్నాయి. సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో వాళ్లు ప్రయాణిస్తున్న బోట్ లో నుంచి… 15, 17 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలు.. 15 ఏళ్ల  బాబు ప్రమాదవశాత్తూ నీళ్లలో పడిపోయారు. పిల్లలను కాపాడేందుకు గౌసుద్దీన్, జునేద్, రాహత్ లు నీళ్లలో దూకారు. అప్పటికే స్పందించిన అక్కడి సహాయక బృందం.. పిల్లలను కాపాడగలిగింది. ఐతే… నీళ్లలో దూకిన వాళ్లను మాత్రం రెస్క్యూ చేయలేకపోయింది.

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు విదేశాల్లో మృతి చెందడంతో నల్గొండ జిల్లాలోని మన్యం చెల్క గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి… గౌసుద్దీన్‌ కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు. ఆస్ట్రేలియాలో చనిపోయిన వారికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. వీలైనంత త్వరగా మృతదేహాలను భారత్‌కు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరారు.

Posted in Uncategorized

Latest Updates