కేసీఆర్ 2.0… ముఖ్యమంత్రి కొత్త రికార్డ్

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే ఎనిమిది సార్లు శాసనసభకు, ఐదు సార్లు లోక్‌సభకు ఎన్నికైన ఆయన నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి  రెండు సార్లు ఆ పదవిని అధిష్ఠించిన వారి సరసన నిలిచారు. తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా 2014 జూన్‌ 2న బాధ్యతలు చేపట్టి 51 నెలలపాటు పని చేశారు.  అనంతరం మూడు నెలలపాటు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగారు. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

మర్రి చెన్నారెడ్డి (కాంగ్రెస్‌): రెండుసార్లు సీఎం పదవి చేపట్టారు. మొదటి సారి 1978 మార్చి 6 నుంచి 1980 అక్టోబరు 11 వరకు రెండు సంవత్సరాల 19 రోజులు ఉన్నారు. 1989 డిసెంబరు మూడో తేదీ నుంచి 1990 డిసెంబరు 17 వరకు సంవత్సరం 14 రోజులపాటు ముఖ్యమంత్రిగా పని చేశారు.

కోట్ల విజయభాస్కర్‌రెడ్డి (కాంగ్రెస్‌): మొదటి సారి 1982 సెప్టెంబరు 20 నుంచి 1983 జనవరి 9 వరకు 111 రోజులు, రెండోసారి 1992 అక్టోబరు 9 నుంచి 1994 డిసెంబరు 12 వరకు రెండు సంవత్సరాల 64 రోజులపాటు సీఎంగా వ్యవహరించారు.

నందమూరి తారకరామారావు (టీడీపీ): నాలుగుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. మొదటి సారి 1983 జనవరి 9 నుంచి 1984 ఆగస్టు 16 వరకు సంవత్సరం 181 రోజులు పదవిలో ఉన్నారు. రెండోసారి 1984 సెప్టెంబరు 16 నుంచి 1985 మార్చి 9 వరకు 174 రోజులు, మూడోసారి 1985 మార్చి 9 నుంచి 1989 డిసెంబరు రెండో తేదీ వరకు నాలుగు సంవత్సరాల 269 రోజులు, నాలుగోసారి 1994 డిసెంబరు 12 నుంచి 1995 సెప్టెంబరు 1 వరకు 263 రోజులు పదవిలో కొనసాగారు.

నారా చంద్రబాబునాయుడు (టీడీపీ): మొదటి సారి 1995 సెప్టెంబరు 1 నుంచి 2004 మే 14 వరకు రెండు విడతలుగా, మూడో సారి విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 2014 జూన్‌ 8 నుంచి సీఎంగా కొనసాగుతున్నారు.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి(కాంగ్రెస్‌): 2004 మే 14 నుంచి పూర్తికాలం పాటు, 2009 మే నుంచి సెప్టెంబరు రెండో తేదీ వరకు కొనసాగారు.

కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(టీఆర్ ఎస్): తెలంగాణ ఆవిర్భావం అనంతరం ప్రత్యేక రాష్ట్రంలో మొదటిసారి 2014 జూన్‌ రెండో తేదీ నుంచి 2018 డిసెంబరు 12 వరకు ఉన్నారు. రెండో సారి 2018 డిసెంబరు 13న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates