ఆ కారణంతోనే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయలేదు : కేసీఆర్ చిట్ చాట్

తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశం, కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనం అంశాలపైనా కేసీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత ఆ రోజుల్లోనూ లేదన్నారు కేసీఆర్. 2014 ఎన్నికల ముందు సోనియా గాంధీని కలిసినప్పుడు.. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనంపై చర్చ జరిగిందన్నారు. సోనియాగాంధీని కలిసి తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి గురించి వివరించానని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ లో నాయకత్వలోపం ఉందన్న సంగతి సోనియాకు వివరించానన్నారు. “కాంగ్రెస్ ను జనం నమ్మడం లేదని చెబితే.. దిగ్విజయ్ సింగ్ తో మాట్లాడాలని సోనియా చెప్పారన్నారు. ఐతే… దిగ్విజయ్ సింగ్ అవమానించాడని కేసీఆర్ అన్నారు. రెండురోజులు ఓపిక పట్టిన సమయంలోనే… టీఆర్ఎస్ పార్టీనుంచి విజయశాంతి, గడ్డం అరవింద్ లతోపాటు.. కొందరు నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకున్నారని చెప్పారు. టీఆర్ఎస్ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాలని అన్ని వర్గాలనుంచి సూచనలు రావడంతో… తాము ఓ నిర్ణయం తీసుకుని ఎన్నికలకు వెళ్లామని చెప్పారు కేసీఆర్.

అమ్మతోడు… ఏ అధికారితో మాట్లాడలేదు

అసెంబ్లీ రద్దయ్యాక… “అమ్మతోడు..! ఏ అధికారితోనూ ఎన్నికలకు సంబంధించి మాట్లాడలేదు” అని చెప్పారు కేసీఆర్. జిల్లా ఎస్పీలతో కలెక్టర్లతోనే కాదు.. కనీసం సీఎస్ తోనూ మాట్లాడలేదన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఏం కోడ్ ఉల్లంఘన అవుతుందోనని ఎవ్వరితోనూ మాట్లాడలేదని చెప్పారు. కేవలం మిషన్ భగీరథ గురించి.. స్మిత సభర్వాల్ తో ఓ సారి వివరాలు అడిగి తెల్సుకున్నా అన్నారు కేసీఆర్. 2014లో తాము ఉత్తర తెలంగాణనే నముకున్నామన్న కేసీఆర్.. అక్కడే 44సీట్లు వచ్చాయన్నారు. ఈసారి టీఆర్ఎస్ రాష్ట్రమంతటా 106 సీట్లు గెలవాల్సింది కానీ.. చిన్న చిన్న పొరపాట్ల కారణంగా.. 88 మాత్రమే గెలవగలిగామని చెప్పారు. పార్టీలో చేరికలు చాలా ఉండబోతున్నాయని అన్నారు కేసీఆర్. గెజిట్ విడుదల కాగానే ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరుగుతుందన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates