ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్లు వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం (జూలై-11) రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సూర్యాపేట జిల్లా తడిసి ముద్దైంది. జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. సూర్యాపేట దంతాలపల్లి రోడ్డుపై పెద్ద చెట్లు కూలడంతో ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల దూరం వాహనాలు ఆగిపోయాయి. పడిపోయిన చెట్టును తొలగించేందుకు చాలా సమయం పట్టింది.

పోలీసులు పెద్ద కట్టర్లను తెప్పించి చెట్టు కొమ్మలను ముక్కలు చేసి అడ్డు తొలగించారు. దాంతో రెండు గంటల తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయింది. మహబూబ్ నగర్ జిల్లాలో బుధవారం(జులై 11) రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీటితో రోడ్లన్నీ చెరువులుగా మారాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం చిరు వ్యాపారులకు ఇబ్బందిగా మారింది.

భారీ వర్షానికి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెనుబల్లి మండలం విఎం బంజర్ లో పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీరు రోడ్లపై చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి. లంకాసాగర్ ప్రాజెక్టు, బేతుపల్లి చెరువుకు సైతం భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షం కారణంగా సత్తుపల్లిలోని జేవీఆర్ ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. దాదాపు లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగడంతో… 8కోట్ల నష్టం జరిగిందని చెపుతున్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates