ఆ 98 పోస్టుల భర్తీ చెల్లదు

పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీ వివాదంపై హైకోర్టు తీర్పు 

హైదరాబాద్‌, వెలుగు: హైకోర్టుకు ఇచ్చిన హామీకి విరుద్ధంగా, ప్రభుత్వ జీవోకు వ్యతిరేకంగా నియమించిన 98 జూనియర్‌ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీ చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. జీవో 74 ఉమ్మడి ఏపీలో 2012లో జారీ అయిందని, దాని ప్రకారమే స్పోర్ట్స్‌ కోటా కింద176 పోస్టులను భర్తీ చేస్తామని గతంలో పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ హైకోర్టుకు హామీ ఇచ్చారు. అయితే176 పోస్టుల్లో 98 పోస్టులను ఆ జీవోతో సంబంధం లేకుండా భర్తీ చేశారంటూ శ్రీనివాస్‌ అనే అభ్యర్థి మరో ఇద్దరు హైకోర్టులో కోర్టుధిక్కార కేసులు దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌. రామచందర్‌రావు ఆ 98 పోస్టుల భర్తీ చెల్లదని తీర్పు చెబుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

స్పోర్ట్స్‌ కోటా కింద భర్తీ చేసే పోస్టులకు అర్హత సాధించాలంటే అర్హత మార్కులు 35 ఉండాలని జీవో 74 స్పష్టం చేస్తోందని, అయితే జీవోలోని అంశాల్ని నోటిఫికేషన్‌లో పేర్కొనలేదన్న పిటిషనర్ల వాదనను  కోర్టు పరిగణనలోకి తీసుకుంది.  ఆ 98 పోస్టుల భర్తీ చెల్లదని, తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేయాలని, తామిచ్చే ఈ తీర్పు కాపీ అందిన 3 నెలల్లోగా తిరిగి ఆ పోస్టులను జీవో నిబంధనలకు అనుగుణంగా భర్తీ చేయాలని  కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

see also: ఓట్ల కోసం కోళ్ల పంపిణీ

Latest Updates