ఇంగ్లిష్ అర్థంకావడంలేదని విద్యార్థి సూసైడ్

చదువుకునే వయసులో విద్యార్థుల మనసులో ఏవో ఆలచనలు. పాఠాలు అర్ధంకాక ఒత్తిడి..ఫెయిల్ అయితే పరువుపోతుందని..దీంతో క్షణికావేశాలతో సూసైడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే సూర్యపేటలో జరిగింది. ఎంత చదివినా తనకు ఇంగ్లిష్‌ అర్థంకావడం లేదనే మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్నతచదువులు చదివి.. మంచి ఉద్యోగం సంపాదించి అవసాన దశలో తమను చూసుకుంటాడని ఆశించిన తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని మిగిల్చాడు. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రానికి చెందిన కాసర్ల మురళీకృష్ణ (22)దీ విషాదాంతం. మురళీకృష్ణ హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ లోని ఓ కాలేజీలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేస్తున్నాడు. స్నేహితులతో కలిసి కవాడిగూడలో ఓ అద్దె గదిలో ఉంటున్నాడు.

కళాశాలలలో బోధిస్తున్న ఇంగ్లిష్‌ తనకేమీ అర్థం కావడంలేదని కొన్నాళ్లుగా అతడు ఆవేదన చెందుతున్నాడు.  ఈ క్రమంలో బుధవారం రాత్రి గదిలో ప్యాన్‌ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తొటి మిత్రులు విషయాన్ని స్థానిక పోలీసులకు, కుటుంబసభ్యులకు తెలియజేశారు. మృతుడు ఆంగ్లం అర్ధంకావటంలేదంటూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌ నోట్‌ లో రాసినట్లు దోమలగూడ పోలీసులు తెలిపారు. ఇంగ్లీష్ అర్థంకావడంలేదని ఎన్నోసార్లు తమతో చెప్పినట్లు తెలిపారు మురళీకృష్ణ ఫ్రెండ్స్. విషయం తెలిసి తల్లిదండ్రులు అంజయ్య, అంజమ్మ గుండెలవిసేలా రోదించారు. మురళీకృష్ణ మృతితో మునగాలలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Posted in Uncategorized

Latest Updates