ఇంచార్జ్ MEOలుగా హెడ్మాస్టర్లు…తగ్గుతున్న విద్యాప్రమాణాలు

schoolఉమ్మడి వరంగల్ జిల్లాలో మండల విద్యాశాఖ అధికారుల కొరత వేదిస్తుంది. కొన్నేళ్లుగా రెగ్యులర్ MEOలు లేకపోవడంతో.. ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. అటూ స్కూళ్లలో సరైన పర్యవేక్షణ లేక విద్య ప్రమాణాలు తగ్గుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంచార్జ్ MEOల పాలన సాగుతోంది. గత 13 ఏళ్లుగా రెగ్యులర్ ఎంఈవోల కొరత ఉంది. ప్రభుత్వం కొత్తవాళ్లను నియమించకపోవటంతో.. సీనియర్ ప్రధానోపాధ్యాయులకే అదనంగా ఎంఈఓలుగా ఇంచార్జీ బాధ్యతలు అప్పగిస్తున్నారు జిల్లా అధికారులు. దీంతో ఒక్కరే రెండు రకాల విధులు నిర్వహించటం కష్టంగా మారిందంటున్నారు హెడ్మాస్టర్లు.

వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్, మహబూబాబాద్ జిల్లాల్లో 75 మండలాలు ఉన్నాయి. మండలానికో విద్యాశాఖాధికారిని నియమించాలి. వీళ్లంతా పాఠశాలల పనితీరును పర్యవేక్షించాలి. కానీ ఇద్దరే రెగ్యులర్ MEOలు ఉన్నారు. మిగిలిన 73 మండలాలు ఇన్ ఛార్జుల పాలనలోనే నడుస్తున్నాయి. పాఠశాలలపై పర్యవేక్షణ లేక.. విద్యా ప్రమాణాలు తగ్గుతున్నాయంటున్నారు టీచర్లు.

రెండు చోట్ల విధులు చేయటంవల్ల.. మండల విద్యాశాఖ అధికారిగా.. అటూ ప్రధానోపాధ్యాయుడిగా దేనికీ సరైన న్యాయం చేయటంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా విద్యను అందించేందుకు మౌళిక వసతులు కల్పిస్తున్నా.. రెగ్యులర్ ఎంఈఓలను నియమించటం లేదంటున్నారు.  కీలకమైన ఎంఈవోలను నియమించకపోవటంతో.. స్కూళ్లపై పర్యవేక్షణ తగ్గి.. విద్యా ప్రమాణాలు తగ్గి పోతున్నాయంటున్నారు పేరెంట్స్.

ప్రస్తుతం ఎంఈవోలపై పని భారం మరింత పెరిగిందంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. రెండేళ్ల క్రితం వరకు స్కూళ్లను పర్యవేక్షించటం, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, ఉపాధ్యాయుల డిప్యూటేషన్, స్కూల్  కాంప్లెక్స్  సమావేశాలతో పాటుగా.. పాఠ్యపుస్తకాల పంపిణీ పని మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు విద్యార్థుల సంఖ్య పెంచడం, బడుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రమాణాల పెంపు తదితర విధులు నిర్వహించాల్సి వస్తోందంటున్నారు.

ఉపాధ్యాయుల సర్వీస్  నిబంధనల్లో ఇప్పటికీ ప్రతిష్టంబన కొనసాగుతూనే ఉంది. 2005లో అప్పటి ప్రభుత్వం … ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పదోన్నతి కల్పించింది. 52 మందిని రెగ్యులర్ ఎంఈవోలను నియమించింది. ఆ తర్వాత పదోన్నతులు లేవు. ఉద్యోగ విరమణ పొందిన రెగ్యులర్ MEOల స్థానాల్లో కొత్త వారిని నియమించకపోవడంతో ఇంచార్జీల పాలన తప్పటం లేదంటున్నారు.

అకాడమిక్ ఇయర్ మొదలవుతున్నందున.. రెగ్యులర్ ఎంఈవోలను నియమించాలని కోరుతున్నారు ప్రధానోపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు.

Posted in Uncategorized

Latest Updates