ఇంజినీర్ కావాల్సిన కశ్మీర్ కుర్రాడు.. ఉగ్రవాదిగా హతమయ్యాడు

అతడి పేరు సాకిబ్ బిలాల్. టెన్త్ క్లాస్ చదివాడు. ఇంటర్ లో ఎంపీసీ తీసుకున్నాడు. కశ్మీర్ లోని బండిపొరా దగ్గర్లో… హాజిన్ లో ఉండేవాడు. వ్యవసాయం ఆధారంగా బతికే కుటుంబం వాళ్లది. సాకిబ్ కు ఇంజినీర్ కావాలని లక్ష్యం ఉండేది. ఏం జరిగిందో తెలియదు. నాలుగు నెలల కిందట ఇంటినుంచి గాయబ్ అయ్యాడు. శ్రీనగర్ శివారులో జరిగిన ఎన్ కౌంటర్ లో పాకిస్థానీ ఉగ్రవాదులతోపాటు.. శవమై తేలాడు.

ఈ సంఘటన కశ్మీర్ లోని జరుగుతున్న పరిస్థితులను కళ్లకు కడుతోంది. సాకిబ్ బిలాల్ తో పాటు… హాజిన్ గ్రామం నుంచి తప్పిపోయిన 9వ తరగతి స్టూడెంట్ కూడా ఉగ్రవాదుల్లో ఉన్నాడు. డిసెంబర్ 9వ తేదీన.. శ్రీనగర్ శివారులోని ముజ్గుండ్ లో… పాకిస్థానీ లష్కరే తోయిబా మిలిటెంట్లు, భారత సైన్యం మధ్య 18 గంటలపాటు జరిగిన ఎదురుకాల్పుల్లో వీరిద్దరూ హతమయ్యారు.

అప్పటికే బిలాల్ పై మిస్సింగ్ కేసు నమోదై ఉంది. డీటెయిల్స్ మ్యాచ్ కావడంతో.. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. బిలాల్ సాకిబ్ చదువులో చురుగ్గా ఉండేవాడని తల్లిదండ్రులు చెప్పారు. మిలిటెంట్ గా మారి ప్రాణాలు పోగొట్టుకుంటాడని కలలో కూడా ఊహించలేదన్నారు.

“హైదర్” సినిమాలో నటించిన సాకిబ్ బిలాల్

కుటుంబసభ్యులు చెప్పిన వివరాల ప్రకారం… బిలాల్ సాకిబ్ థియేటర్ ఆర్టిస్ట్. తైక్వాండే, కబడ్డీ నేర్చుకున్నాడు. సినిమాలపై ఉన్న ఆసక్తితో.. విశాల్ భరద్వాజ్ ఇచ్చిన ప్రోత్సాహంతో.. “హైదర్”అనే బాలీవుడ్ సినిమాలో ఓ పాత్ర పోషించాడు. కూరగాయలు, సరుకులు తెస్తానంటూ ఆగస్ట్ 31న ఇంట్లోనుంచి బయటకు వెళ్లిపోయిన బిలాల్ మళ్లీ ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు టెన్షన్ పడ్డారు. ఎవరో ఇద్దరు వ్యక్తులతో కలిసి బైక్ పై వెళ్లాడని చూసిన వాళ్లు చెప్పారు. తల్లిదండ్రులు ఎంతో వెతికారు. కానీ దొరకలేదు. అతడెక్కడున్నా బాగా ఉండాలంటూ మంత్రగాడు ఇచ్చిన ఓ రక్షను ఇంట్లో పెట్టుకుని పూజిస్తోంది ఆ తల్లి. కానీ.. ఏదైతే వినకూడదని అనుకున్నారో… అదే విషాదం వారిని వెతుక్కుంటూ వచ్చింది. తమ కొడుకు మిలెటెన్సీవైపు, ఉగ్రవాదం వైపు ఎందుకు ఆకర్షితుడయ్యాడో తమకు అర్థం కావడంలేదని అతడి మేనమాన ఐజాజ్ అన్నారు. టెర్రరిస్టుగా ప్రాణాలు పోగొట్టుకుంటాడని అనుకోలేదంటూ ఆ కుటుంబం ఆవేదన చెందుతోంది. బిలాల్ తో పాటు.. ఆరోజు ఊరు విడిచి వెళ్లిపోయిన 9వ తరగతి విద్యార్థి ఓ పేదింటి కుర్రాడు. అతడు కూడా ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. ఇంట్లోంచి వెళ్లిపోయినప్పుడే ఈ ఇద్దరు ఉగ్రవాదుల్లో చేరారని పోలీసులు చెప్పడంతో.. ఆ కుటుంబం అంతులేని ఆవేదనకు లోనవుతోంది.

 

Posted in Uncategorized

Latest Updates