ఇండియా ఓపెన్ ఫైనల్ : పోరాడి ఓడిన సింధు

sindhuభారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇండియా ఓపెన్ ఫైనల్లో పరాజయం పాలైంది. ఉత్కంఠపోరులో అమెరికన్ షట్లర్ బీవెన్ జంగ్ చేతిలో ఓటమి చవిచూడటంతో రన్నరప్‌గా నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. న్యూఢిల్లీలో ఆదివారం (ఫిబ్రవరి-4) జరిగిన ఫైనల్ లో సింధు 18-21, 21-11, 20-22తో పోరాడి ఓడింది.
ఫైనల్ ఫోబియా : సింధు ఫైనల్ పరాజయాల పరంపర కొనసాగుతున్నది. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్, హాంకాంగ్ ఓపెన్, దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో ఓడిన ఈ భారత స్టార్ షట్లర్ నాలుగోసారి తుదిపోరులో తడబడింది.

ఫస్ట్ గేమ్‌లో ఆరంభం నుంచి ఆధిక్యం ప్రదర్శించిన బీవెన్‌కు సింధు గట్టిపోటీ ఇచ్చినా, పాయింట్స్ కోసం వీడియో రెఫరల్స్‌కు వెళ్లినా,  బీవెన్ జంగ్ ను అడ్డుకోలేకపోయింది. రెండో గేమ్‌లో తిరిగి పుంజుకున్న సింధు తొలుత 8-2 ఆధిక్యాన్ని ప్రదర్శించి అదే దూకుడుతో గేమ్‌ను గెలుచుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఇద్దరూ పదునైన స్మాష్‌లతో పోటీపడగా బీవెన్ ఆధిక్యంలో కొనసాగింది. దీంతో మరోసారి సింధు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Posted in Uncategorized

Latest Updates