ఇకపై కోర్టు ప్రొసీడింగ్స్ లైవ్ టెలికాస్ట్ : సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు

గతంలో అసెంబ్లీ, పార్లమెంటులలో ఏం జరుగుతుందో కూడా సామాన్య ప్రజలకు తెలిసేది కాదు. అయితే 2003 నుంచి అసెంబ్లీ, పార్లమెంటులలో జరిగే వ్యవహారమంతా లైవ్ టెలికాస్ట్ చేస్తుండడంతో అక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు తెలిసింది. దీంతో ఎమ్మెల్యేలు, ఎంపీలకు పారదర్శకత  జవాబుదారీ తనం పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. ఇకపై కోర్టు ప్రొసీడింగ్స్ ను కూడా లైవ్ టెలికాస్ట్ చేసేందుకు తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. కొన్ని సున్నితమైన కేసులు మినహాయించి..మిగతా అన్ని కేసులు ప్రత్యక్ష ప్రసారం చేయవచ్చని తేల్సి చెప్పింది. కోర్టుల్లో లైవ్ టెలికాస్టింగ్ చేయాలని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వేసిన పిటిషన్ పై ఈ ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు.

ఇప్పటివరకు కోర్టు లోపల ఏంజరుగుతుందో చాలామందికి తెలియదు. సినిమాలు, సీరియళ్లలో చూడడం తప్ప నిజ జీవితంలో కోర్టుకు వెళ్లిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే పార్లమెంటు, అసెంబ్లీ తరహాలోనే కోర్టులో వాదనలను లైవ్ టెలికాస్ట్ చేయాలని కోరుతూ  సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ తదితరులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. కోర్టులో లైవ్ టెలికాస్ట్ కోసం ప్రత్యేక ఛానెల్ ను పెడతామని స్పష్టం చేసింది కేంద్రం.
కోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రజలకు న్యాయవ్యవస్థ మరింత చేరువవుతుందని అభిప్రాయపడ్డారు ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా. దీని ద్వారా కేసుతో సంబంధం ఉన్న వారికి కూడా విచారణపై మరింత స్పష్టత వస్తుందన్నారు. అయితే అత్యాచార ఘటనలు వివాహానికి సంబంధించిన వివాదాలతో పాటు కొన్ని సున్నితమైన కేసులకు మినహాయింపు ఉంటుందన్నారు మిశ్రా.

 

Posted in Uncategorized

Latest Updates