ఇక ఆటలు సాగవు : ఆహార కల్తీలను కనిపెట్టే ఫుడ్ సేఫ్టీ వ్యాన్

mmm (1)రోజురోజుకి పెరుగుతున్న కల్తీ అక్రమాలకు చెక్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇక నుంచి ఎక్కడ కల్తీ చేసినా ఈజీగా కనిపెట్టే మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ తెలంగాణలోనూ అందుబాటులోకి తీసుకువచ్చింది. సోమవారం (ఫిబ్రవరి-5) హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (IPM) లో ఈ మొబైల్ వ్యాన్ ను హెల్త్ మినిస్టర్  లక్ష్మారెడ్డి, శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్ ప్రారంభించారు.
రూ. 50 లక్షలతో రూపొందిన ఈ వాహనంలో కల్తీలను నియంత్రించేందుకు అవసరమైన హై టెక్నాలజీను ఏర్పాటు చేశారు. వాహన నిర్వహణ, ఇంధన ఖర్చుల కోసం ఏటా రూ. 5 లక్షలను సైతం కేంద్ర ప్రభుత్వమే ఇవ్వనుందని తెలిపారు మంత్రి లక్ష్మారెడ్డి. ఇకపై ఈ వ్యాన్‌ డైరెక్టుగా హోటళ్లు, కర్రీ పాయింట్లు, ఫిర్యాదులు చేసే వినియోగదారుల ఇళ్ల వద్దకు వచ్చి మరీ పరీక్షలు చేయనుంది. పాల ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్ల నుంచి వంటల్లో వాడే మసాలాలు, నూనెల వరకు…కిరాణా కొట్లో కొనే సరుకుల నుంచి కర్రీ పాయింట్లలో విక్రయించే కూరలు, హోటళ్లు, రెస్టారెంట్లలో వడ్డించే వంటకాల వరకు జరుగుతున్న కల్తీలకు ఇకపై నిమిషాల వ్యవధిలోనే అడ్డుకట్ట పడనుంది. చాలా రకాల నమూనాలపై కేవలం 10 నిమిషాల్లోనే ఫలితాలను వెల్లడించనుంది.
ఇప్పటివరకు ఆహార నమూనాలను పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లి వాటి నాణ్యతను తేల్చేందుకు ఎక్కువ కాలం పడుతుండగా ఇక నుంచి ఫిర్యాదులు అందిన చోటే పరీక్షలు జరగనున్నాయి. ఆహార పదార్థాల నాణ్యతపై అక్కడికక్కడే ఫలితాలు వెలువడనున్నాయి. ఆహార ఉత్పత్తుల వ్యాపారం ఎక్కువగా జరిగే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఈ వాహనం సేవలను ఎక్కువగా ఉపయోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిర్యాదుల కోసం 9100107309 నంబర్ ను సంప్రదించగలరు.

 

Posted in Uncategorized

Latest Updates