ఇక దమ్ముంటే తాగండి: డ్రంక్ అండ్ డ్రైవ్ జైలు శిక్షను సమర్ధించిన హైకోర్టు

high-courtరోడ్డు ప్రమాదాలకు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రధాన కారణంగా తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు. తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు కూడా  చేపట్టారు. స్పెషల్ డ్రైవ్ లతో వాహనాలు సీజ్ చేయడం.. జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా విధిస్తున్నారు. జైలు శిక్షలపై కొంత మంది అసహనం వ్యక్తం చేస్తూ.. హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో భాగంగా హైకోర్టు  డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారికి గట్టి షాక్ ఇచ్చింది. తాగి వాహనాలు నడిపితే శిక్ష పడాల్సిందేనని కింది కోర్టు తీర్పులను సమర్ధించింది.

మందు కొట్టి వాహనం నడుపుతూ పట్టుబడిన ఓ వ్యక్తికి 10 రోజుల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేశాడు. ఈ కేసుపై విచారించిన హైకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. తాగి వాహనాలు నడపడం సమాజానికి హానికరంగా మారిందని అభిప్రాయపడింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని.. దీంతో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ పి.కేశవరావు మంగళవారం(జులై-3) తీర్పునిచ్చారు.

సికింద్రాబాద్, పార్సీగుట్టకు చెందిన చంద్రశేఖర్‌ గతేడాది జూన్‌ 15న మందు కొట్టి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. విచారణ జరిపిన హైదరాబాద్‌ నాలుగో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు.. చంద్రశేఖర్‌కు 10 రోజుల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధించింది. మోటార్‌ వాహనాల చట్టం కింద రూ.100 జరిమానా విధించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ అప్పీల్‌ చేశారు. మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి విచారణ జరిపారు. మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఇచ్చిన తీర్పును సెషన్స్ కోర్టు కూడా సమర్థించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ చంద్రశేఖర్‌ హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ పి.కేశవరావు విచారణ జరిపారు. పిటిషనర్‌ మద్యం తాగి వాహనం నడపడం ఇది రెండోసారి.. కాబట్టి అతనిపై జాలి చూపాల్సిన అవసరం లేదని తెలిపారు. జైలు శిక్షను సమర్ధించారు.

Posted in Uncategorized

Latest Updates