ఇతనికి పద్మశ్రీ ఇవ్వాల్సిందే.. నదుల్లో ప్లాస్టిక్ వెలికితీసే ఉద్యమకారుడు

బీట్ ప్లాస్టిక్ సొల్యూషన్ హ్యాష్ ట్యాగ్ తో ఉద్యమం నడుపుతున్నాడు. నదులు, బీచ్ ల్లోని ప్లాస్టిక్ చెత్తను ఏరేస్తూ.. క్లీన్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. జలచరాలను కాపాడేందుకు ఆయన చేస్తున్న పోరాటాన్ని యావత్ భారతం మెచ్చుకుంటోంది. అతడే లాయర్, సామాజిక కార్యకర్త అఫ్రోజ్ షా. ప్లాస్టిక్ కారణంగా నదులు కలుషితం కావడమే కాదు.. అందులో బతికే ప్రాణులు కూడా చనిపోతున్నాయంటున్నాడు ముంబైకి చెందిన అఫ్రోజ్.

2015 అక్టోబర్. ముంబైలోని వెర్సోవా బీచ్. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు,.. చెత్తా చెదారం. దీనిని చూసి నీళ్లలోకి దిగాలంటేనే వెనకడుగేశాడు. ఈ పరిస్థితి మార్చాలనుకున్నారు. ఎంతో శ్రమించి.. ఆటంకాలు అధిగమించి.. బెదిరింపులను తట్టుకుని… ఏడాదిన్నరలో మార్పు చూపించారు. బృహన్ ముంబై అధికారులు, స్వచ్చంద సంస్థల సహకారంతో కలిసి… వెర్సోవా బీచ్ ను దాదాపుగా క్లీన్ గా మార్చేశారు అఫ్రోజ్. యువత, ఎన్జీఓలు, సెలబ్రిటీలు.. ఆయనకు సాయపడ్డారు. 90లక్షల కేజీల ప్లాస్టిక్ వేస్టేజీని తన టీమ్ తో కలిసి వెలికి తీయించారు. ఇపుడు ముంబైలోని మితి రివర్ ను క్లీన్ చేసే పనిలో పడ్డారు. నదులు, బీచ్ లను ప్లాస్టిక్ ఫ్రీగా మార్చి.. శుభ్రం చేయడాన్ని ఓ యజ్ఞంగా భావించిన అఫ్రోజ్ ను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ ను ఇచ్చి గౌరవించింది.

వాషింగ్టన్ డీసీలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన అఫ్రోజ్ షా.. అంజ్ కోస్టియర్ లోని పొటోమాక్ నదిని శుభ్రపరచడంలో తాను కూడా పాల్గొన్నానని చెప్పారు. ఇండోర్ లోని కాహన్, లక్నోలోని గోమతి నదులను క్లీన్ చేయడంలో భాగమయ్యానన్నారు. ఈ నదుల్లోని నీళ్లు శుభ్రంగానే ఉన్నా.. ప్లాస్టిక్ బాగా కలిసిపోవడంతో.. కాలుష్యం పెరిగిపోతోందని.. నీళ్లలో బతికే జీవుల చనిపోతున్నాయని అన్నారు. ఎన్విరాల్ మెంటల్ లా పైన ఓ ప్రాజెక్టు రెడీ చేసినప్పుడు మితి నదిపై ఓ డాక్యుమెంటరీ సిద్ధం చేసిన అఫ్రోజ్.. దానిని క్లీన్ చేయాలని డిసైడయ్యానని చెప్పారు.

ఇపుడు ముంబైలోని మితి నది క్లీనింగ్ లో పాల్గొంటున్నారు. పొవై, విహార్ నదుల సంగమం ఈ మితి నది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ …. అఫ్రోజ్ షాకు ఎస్కార్ట్ గ్రూప్ కంపెనీకి చెందిన రెండు భారీ మెషీన్లను కొనిచ్చారు. వాటితో తన పని మరింత తేలికవుతోందని అంటున్నాడు అఫ్రోజ్. జలచరాలను బతికించే ప్రయత్నంలో.. వెర్సోవా బీచ్, దావూదీ బొహ్రాస్, బీఎఫ్ఐ ఎన్విరాన్ మెంట్ .. పలు ఎన్జీఓలు, యువత సహకారం అందిస్తున్నారు. వెర్సోవా బీచ్ లో 20వేల మందికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి… ప్లాస్టిక్ చెత్త ముక్కలను ఏరేశారు. ప్రభుత్వానికి ఓ రిపోర్ట్ కూడా అందించారు. జనంతోపాటు.. తయారీదారులు కూడా సహకరిస్తేనే నదులను పరిశుభ్రంగా , ఆరోగ్యంగా ఉంచుకోగలం అంటున్నారు అఫ్రోజ్.

స్కూళ్లలో దీనిపై అఫ్రోజ్ షా ప్రత్యేకంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. తీర ప్రాంతాలు, బీచ్ లలో ఇంటిటికి తిరిగి ప్లాస్టిక్ పై అవగాహన కలిగిస్తున్నారు. సర్క్యులర్ ఎకానమీ, చెత్తను వేరు చేయడంపై ఈ నదీ తీరాల్లో వారికి ప్రతిరోజూ వివరిస్తున్నాడు. నిర్లక్ష్యంగా పడేసే ప్లాస్టిక్ చెత్త కారణంగా.. నదులు కలుషితం అవుతున్నాయని… జలచరాలు అంతరించిపోతున్నాయని… మనిషికే ప్రమాదం పొంచి ఉందని వివరిస్తున్నాడు.

మాతృభూమి కోసం.. అమ్మలాంటి ప్రకృతి కోసం ఓ చిన్న ప్రయత్నం అంటున్నాడు అఫ్రోజ్ షా. బీట్ ప్లాస్టిక్ సొల్యూషన్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఓ ఉద్యమమే చేస్తున్నాడు అఫ్రోజ్ షా.  నదీతీరంలో ప్లాస్టిక్, ఇతర చెత్త ఏరివేయడం… చెత్త వేయొద్దని చెప్పడం.. జనంలో చైతన్యం తీసుకురావడం.. ఇదే ఆయన షెడ్యూల్. ప్రతివారం.. ఒక్కో తీర ప్రాంతంలో కొంత సమయం గడుపుతున్నాడు. మాతో చేతులు కలపండి అఫ్రోజ్ చేసిన విజ్ఞప్తికి ఒక్క ముంబై మాత్రమే కాదు.. దేశంలోని చాలామంది కదిలి ఉద్యమంలో భాగం అవుతున్నారు.

ఇలాంటి వ్యక్తిని కేంద్రప్రభుత్వం గుర్తించాలంటూ నెటిజన్లు, యువత సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అఫ్రోజ్ షా చేస్తున్న సర్వీస్ ను మెచ్చుకుంటూ షేర్ చేస్తున్నారు. పద్మశ్రీ లాంటి పురస్కారాన్ని ఇతడికి ఇచ్చి గౌరవించాలని కేంద్రాన్ని, ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరుతున్నారు. ఓ సోదరుడిగా నిన్ను చూస్తుంటే మాకు గర్వంగా ఉందంటూ పొగుడుతున్నారు నెటిజన్లు. క్లీన్ గంగా లాగే క్లీన్ మితి కూడా ఓ భారీ ప్రయత్నమే అంటున్నారు. మనుషుల్లో ఆలోచనలు ముందు క్లీన్ అయితే గానీ… ఇలా నదులు పరిశుభ్రంగా మారవని యువత మెసేజ్ చేస్తున్నారు. అఫ్రోజ్ లాంటివాళ్లు.. దేవుడు పంపిన దూతల్లాగా అనిపిస్తారని చెబుతున్నారు. ఇతడు నిజమైన హీరో అని.. అతడికి మరింత శక్తిని అందించాలని ప్రార్థిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates