ఇదెక్కడి క్రూరత్వం : కుక్కలను చంపింది అంటూ.. పని మనిషిని హత్య చేశారు

dogపెంపుడు కుక్కల మృతికి కారణమైందంటూ పని మనిషిని చిత్రహింసలు పెట్టి హత్య చేసిన అక్కాచెల్లెళ్లను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలోని శాస్త్రినగర్ లో అడయార్ రెసిడెన్సీలో నివసించే సుస్మితా ప్రియ (46), మురుగానందం (50) దంపతులు మూడేళ్ల క్రితం ఏపీలోని రాజమండ్రికి చెందిన మహాలక్ష్మి(18)ని ఓ ఏజెన్సీ ద్వారా తమ ఇంట్లో పనికి పెట్టుకున్నారు. ఇటీవల విదేశాల నుంచి పొమరేనియన్, లాబ్ రాడర్ రెట్రిఎవర్ అనే రెండు కుక్క పిల్లలను తెప్పించుకున్నారు. రెండు వారాల క్రితం ఆ రెండు కుక్కలు చనిపోయాయి. కుక్కల మృతికి.. పని మనిషి మహాలక్ష్మి కారణమన్న అనుమానంతో సుస్మితా ప్రియ, ఆమె చెల్లెలు మిత్రాచిని(20) పని మనిషి మహాలక్ష్మిని ఓ గదిలో బంధించి ఆమెను శారీరకంగా హింసించారు. అంతేకాకుండా మరుగుతున్న వేడినీటిని ఒంటిపై పోశారు.

మహాలక్ష్మిని హాస్పిటల్ కు తీసుకెళ్లాలని భావించినా.. ఇబ్బందుల్లో పడతామని ఇంట్లోనే ఉంచారు సుస్మితా, ఆమె చెల్లెలు. ఇంటికే ఓ నర్సుని పిలిపించి ట్రీట్ మెంట్ ఇప్పించే ప్రయత్నం చేశారు. అప్పటికే కాలిన గాయాలతో బాధపడుతూ మూర్చవ్యాధి వచ్చి గురువారం ఉదయం 2 గంటల సమయంలో మహాలక్ష్మి మృతి చెందింది. తమ ఇంటి పని మనిషి మూర్చవ్యాధిని భరించలేక ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మహాలక్ష్మి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించగా శరీరం అంతా బొబ్బలు ఉన్నాయి. అనుమానం వచ్చిన పోలీసులు.. తమదైన స్టయిల్ లో ఎంక్వైరీ చేయగా అసలు విషయం బయటపడింది. హత్యకేసుగా నమోదు చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు.
పోలీసుల విచారణ సమయంలో తమ ఎనిమిదేళ్ల కొడుకు బాలాజీని పనిమనిషి కొట్టడం చూసి కోపం ఆపుకోలేక ఇలా చేశామని, అంతేకాకుండా తమ పెంపుడు కుక్క పిల్లలను చంపేసిందన్న అనుమానంతో ఆమెను హింసించి చంపినట్లు నిందితురాళ్లిద్దరూ నేరాన్ని అంగీకరించారు.

Posted in Uncategorized

Latest Updates