ఇదెక్కడి విడ్డూరం, ఘోరం : తక్కువ మార్కులు వచ్చాయని.. కొడుకుని చంపి.. తండ్రి ఆత్మహత్య

father-son-deadరోజు రోజుకు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ప్రతి చిన్న దానికీ చావే పరిష్కారం అనుకుంటున్నారు. వాళ్లు చావటం కాదు.. కన్నోళ్లను కూడా చంపి మరీ ఆత్మహత్య చేసుకుంటున్నారు. హైదరాబాద్ జవహర్ నగర్ లో జరిగిన తండ్రీకొడుకుల మృతిలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తండ్రీకొడుకులు చనిపోవటం ఏంటీ.. కారణాలు ఏంటీ అని పోలీసులు విచారణ చేశారు. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. జనగాం జిల్లా కుందారం నుంచి సిటీకి వచ్చిన దారం సుధీర్ (42) జవహర్ నగర్ లోని శ్రీరాంకాలనీలో మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఇతనికి రజినీతో 15ఏళ్ల క్రితమే వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. తేజ (12), కార్తీక్ (10). తేజ 7వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల విడుదల అయిన ఫలితాల్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అప్పటి నుంచి తండ్రి సుధీర్ బాధపడుతున్నాడు. కుమారుడి చదువుపై బెంగ పెట్టుకున్నాడు. ఇంట్లో కూడా ఇదే విషయంపై కుమారుడిని తిట్టటం చేస్తుండేవాడు.

నాలుగు రోజుల క్రితం పెద్ద కుమారుడు తేజను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు సుధీర్. అప్పటి నుంచి తిరిగి రాలేదు. రెండు రోజలుగా సిటీలో గాలించారు కుటుంబ సభ్యులు. ఆచూకీ లభించలేదు. బుధవారం మధ్యాహ్నం ఈ తండ్రీకొడుకుల మృతదేహాలు చెన్నాపురం చెరువులో లభించాయి. ముందు కుమారుడిని చెరువులోకి తోసి.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు సుధీర్. ఇలాంటి పని చేస్తాడని ఎప్పుడూ ఊహించలేదని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. 7వ తరగతిలో మార్కులు తక్కువ వచ్చాయని కొడుకుని చంపి.. ఆత్మహత్య చేసుకోవటం ఏంటో అర్థం కావటం లేదంటున్నారు స్థానికులు. మెడికల్ షాపు ఓనర్ గా జవహర్ నగర్ ఏరియాలో సుధీర్ అందరికీ పరిచయస్తుడే. అందరితో ఎంతో చనువుగా ఉండే మనిషి.. ఇలాంటి అఘాయిత్యం చేస్తాడని అనుకోలేదంటున్నారు. అయినా 7వ తరగతికే తక్కువ మార్కులు వస్తే బాధపడటం ఏంటని.. ఇది మరీ విడ్డరంగా ఉందని స్థానికులు అంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates