ఇదేనా మహిళలకు రక్షణ : కోర్టులోనే రేప్ చేసిన లాయర్

తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించే న్యాయవాదులే తప్పుడు మార్గంలో వెళ్తూ..సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. లాయర్ ఓ మహిళా లాయర్ ను రేప్ చేశాడు. అది కూడా కోర్టులోనే కావడంతో, ప్రస్తుతం ఈ విషయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఘోర సంఘటన దేశరాజధాని ఢిల్లీలోనే జరుగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణ ఢిల్లీలోని సాకేత్ కోర్టు కాంప్లెక్స్‌ లో తన చాంబర్లో మహిళా న్యాయవాదిని అత్యాచారం చేశాడు ఓ సీనియర్ న్యాయవాది(50ఏళ్లు).

కేసుకు సంబంధించిన వివరాలను DCP(సౌత్) రోమిల్ బానియా వెల్లడించారు. బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపిన సమాచారం ప్రకారం.. శనివారం (జూలై-14) రాత్రి సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడు. నిందితుడు, బాధితురాలు ఇద్దరు కోర్టు భవనంలోని ఒకే కాంప్లెక్స్‌లో పనిచేస్తున్నారు. తాగిన మైకంలో నిందితుడు మహిళా న్యాయవాదిని తన చాంబర్‌ లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. శనివారం అర్ధరాత్రి సమయంలో పోలీసులకు ఫోన్ చేసి బాధితురాలు సమాచారం తెలియజేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు పోలీసులు. ఆమె చెప్పిన వివరాలను నమోదు చేశామని, వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ఆస్పత్రికి కూడా తరలించినట్లు వెల్లడించారు.

లైంగిక దాడి జరిగిన చాంబర్‌ ను సీజ్ చేశామని.. ఫోరెన్సిక్, క్రైమ్ టీమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించాయని వివరించారు DCP. నిందితుడిని ఆదివారం (జూలై-15) ఢిల్లీలోని సంగం విహార్ ప్రాంతంలో అరెస్ట్ చేశామని, తరువాత సాకేత్ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు పోలీసులు. అయితే ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా మండిపడుతున్నాయి మహిళా సంఘాలు. మహిళలపై పోలీసులు, లాయర్లే అత్యాచారానికి పాల్పడితే , ఇక రక్షణ ఎక్కడుంటుందని ప్రశ్నిస్తున్నారు. కాపాడాల్సిన వారే కాటేస్తున్నారంటూ ..తక్షణమే లాయర్ పై కఠినచర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates