కోట్లు ఖర్చు చేసినా వేస్ట్.. హైదరాబాద్ లో మళ్లీ తగ్గిన పోలింగ్

హైదరాబాద్ : అనుకున్నదే అయ్యింది. హైదరాబాద్ లో మళ్లీ పోలింగ్ శాతం తగ్గింది.  సిటీ జనాన్ని పోలింగ్ కేంద్రాలకు రప్పించాలని అధికారులు చేసిన ప్రయత్నాల్నీ వృధా అయ్యాయి.  కోట్లరూపాయలు ఖర్చుపెట్టినా… గతం కంటే ఈసారి మూడు పోలింగ్ శాతం తగ్గడంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. అత్యధికంగా విద్యావంతులున్న ట్విన్ సిటీస్ లోని అన్ని నియోజకవర్గాల్లో ఈసారి పోలింగ్ శాతం బాగా పెంచాలని ఎన్నికల కమిషన్ విశ్వప్రయత్నాలు చేసింది.  వినూత్న రీతిలో చైతన్య కార్యక్రమాలను నిర్వహించింది బల్దియా. ప్రజాస్వామ్యంలో  ఓటుకి ఎంత విలువ ఉందో చెప్పే ప్రయత్నం చేశారు అధికారులు. 5K, 2K రన్స్, మారథాన్స్, ముగ్గుల పోటీలు, వీథి నాటకాలు, కార్తీక దీపారాధన… ఇలా ఎన్నో రకాలుగా ఓటు విలువ తెలియచేశారు. వికలాంగులు, వృద్దుల కోసం ప్రత్యేక వాహనాలు, పోలింగ్ కేంద్రాల్లో ర్యాంప్స్, వారికి సహాయకులను కూడా ఏర్పాటు చేశారు.  పోలింగ్ కేంద్రాలను కనుక్కోడానికి మై GHMC యాప్, నా ఓట్ లాంటి యాప్స్ ని కూడా అందుబాటులోకి తెచ్చారు.

అటు స్వచ్ఛంధ సంస్థలు కూడా అధికారులకు జత కలిశాయి. ఐటీ సంఘాలూ సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్ లో చైతన్యం తెచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేశాయి.  కానీ వీళ్ళందరి ప్రయత్నాలు వృధా అయ్యాయి.  2014 ఎన్నికల్లో 53 శాతానికి పైగా పోలింగ్ నమోదైతే… ఈసారి అంతకన్నా తక్కువగానే రికార్డ్ అయినట్టు ప్రాథమిక అంచనాల బట్టి తెలుస్తోంది. సిటీలో… ఉదయం పోలింగ్  కేంద్రాల్లో జనం పల్చగా కనిపించారు. క్యూలైన్లలో జనమే లేరు. దాంతో పోలింగ్ సెంటర్లకి వెళ్ళిన వాళ్ళంతా కొద్ది టైమ్ లోనే ఓట్లేసి…ఇళ్ళకి వెళ్ళిపోయారు.  ఉదయం నుంచి సాయంత్రం దాకా సిటీలో దాదాపు ఏ పోలింగ్ బూత్ చూసినా ఇదే పరిస్థితి కనిపించింది.  ఒక్కో పోలింగ్ బూత్ లో వెయ్యి నుంచి 14 వందల మందికి ఓట్లేసే అవకాశం కల్పించారు.  అందువల్ల ఒకేసారి ఎక్కువ మంది వచ్చినా… టైమ్ ఎంతో పట్టేది కాదు.

పోలింగ్ శాతం తగ్గడానికి సెలవులు కూడా ఒక కారణమని భావిస్తున్నారు. శుక్ర, శని వారాలు సెలవులు కలసి రావడంతో లాంగ్ వీకెండ్ కోసం కొందరు ఊళ్ళకి, బయటి ప్రాంతాలకు వెళ్ళినట్టు భావిస్తున్నారు.  మరికొందరు ఇళ్ళల్లో ఉండి కూడా ఆసక్తి లేక ఓట్లు వేయడానికి రాలేదని చెబుతున్నారు. సిటీలో ఉన్న పల్లె జనం మాత్రం … ఓటే ప్రాణంగా భావించి రెండు రోజుల ముందే పల్లెలకు వెళ్ళిపోయారు.  రైళ్ళు, బస్సులు రద్దీగా ఉన్నా… లెక్క చేయకుండా ఊరుకి వెళ్ళి ఓట్లు వేశారు.  అయితే సిటీ జనం మాత్రం పోలింగ్ కేంద్రాలకు రాకపోవడం అధికారులకు ఆశ్చర్యం కలిగించింది.

 

Posted in Uncategorized

Latest Updates