ఇద్దరు తెలంగాణ వాళ్ల కృషి : ప్రపంచ కబడ్డీలో తిరుగలేని శక్తిగా భారత్

దేశవ్యాప్తంగా కబడ్డీ కూత మార్మోగుతోంది. దేశంలో క్రికెట్ తప్ప మరే స్పోర్ట్ బతకలేని పరిస్థితుల్లో రివ్వున దూసుకొచ్చింది కబడ్డీ. గ్రామీణ ఆటగా ముద్రపడి… సిటీ జనాలకు తెలియని కబడ్డీ… ఇప్పుడు క్రికెట్ కు దీటైన ఆదరణ పొందుతోంది. ప్రొ కబడ్డీ లీగ్ రాకతో రూరల్ గేమ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగానూ క్రీడాభిమానుల మనసులు గెలుస్తోంది.

భారతీయుల రక్తంలోనే కబడ్డీ ఉంది. అందుకే ప్రపంచ కబడ్డీలో భారత్ తిరుగలేని శక్తిగా వెలిగిపోతోంది. అయితే భారత జట్టు విజయాల్లో ఇద్దరు తెలంగాణవాళ్ల కృషి ఉంది. అందులో ఒకరు జాతీయ జట్టు కోచ్ శ్రీనివాస్ రెడ్డి… కాగా… మరొకరు ఆటగాడు మల్లేష్. శ్రీనివాస్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలోని మారుమూల గ్రామం ఉత్తర్ పల్లికి చెందినవారు కాగా… మల్లేష్ ది సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్.
కబడ్డీ జాతీయ జట్టు కోచ్ శ్రీనివాస్ రెడ్డి తన ఊరి మట్టి కోర్టులోనే కబడ్డీలో ఓనమాలు దిద్దాడు. ఆరేళ్ల వయసులోనే ఆటపై పట్టు సాధించాడు. మండల స్థాయి, జిల్లా స్థాయిలో మెరిసాడు. రాష్ట్రస్థాయిలో ఎదురులేని ఆటగాడిగా పేరు సాధించాడు. జాతీయస్థాయిలో సత్తాచాటాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థానాలను చేరుకున్నాడు. ఆటగాడిగా అద్భుతాలు చేసిన శ్రీనివాస్ రెడ్డి… కోచ్ గా మరింత ఎత్తుకు ఎదిగాడు. భారత కబడ్డీ సీనియర్ జట్టుకు ప్రధాన కోచ్ గా బాధ్యతలు తీసుకున్నాడు.

అంతర్జాతీయ కబడ్డీలో యంగెస్ట్ కోచ్ గా పేరు పొందారు లింగంపల్లి శ్రీనివాస రెడ్డి. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఉత్తరపల్లిలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన శ్రీనివాసరెడ్డి స్కూల్ స్థాయిలోనే కబడ్డీ పట్ల ఇష్టం పెంచుకున్నాడు. కబడ్డీలో శ్రీనివాస్ రెడ్డి టాలెంట్ ను గుర్తించిన కోచ్ సుబ్బారావు అతన్ని మరింత రాటుదేలేలా శిక్షణ ఇచ్చాడు. పలు టోర్నీలో సత్తా చాటాడు శ్రీనివాసరెడ్డి. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ టీమ్ లో చోటు సంపాదించి అక్కడా తనదైన ముద్ర వేశాడు. రాష్ట్రస్థాయి టోర్నీలో ప్రతిభ చూపి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. దాదాపు పదేళ్లపాటు జాతీయ జట్టులో కీ ప్లేయర్ గా సేవలు అందించాడు.

ఐదేళ్ల కిందటే కోచ్ గా మారాడు శ్రీనివాస్ రెడ్డి. సౌత్ కొరియా జట్టుకు కోచ్ గా ఎంపికైన ఆయన.. అక్కడ అద్భుతాలు చేశాడు. 2014 ఏషియన్ గేమ్స్ లో అండర్ డాగ్ గా బరిలోకి దిగిన సౌత్ కొరియా బ్రాంజ్ మెడల్ సాధించిందంటే అది శ్రీనివాస్ రెడ్డి కోచింగ్ స్కిల్స్ తోనే సాధ్యమైంది. తర్వాత ఆస్ట్రేలియా జాతీయ కబడ్డీ జట్టుగా హెడ్ కోచ్ గానూ సేవలు అందించాడు. ఈ మధ్యనే భారత కబడ్డీ జట్టు కోచ్ గా బాధ్యతలు చేపట్టాడు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఏషియన్ గేమ్స్ లో భారత జట్టుకు గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్నాడు. ప్లేయర్ గా సాధించలేకపోయిన ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ ను కోచ్ గా సాధిస్తానని చెబుతున్నాడు శ్రీనివాస్ రెడ్డి. ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ లక్ష్యంగా పెట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి… దాని కోసం శ్రమిస్తున్నాడు. ఆటగాళ్లతో జోరుగా ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. కబడ్డీలో తెలంగాణ ఆటగాళ్లకు మంచి పేరుందంటున్నారు శ్రీనివాస రెడ్డి. ప్రో కబడ్డీ లీగ్ లో జైపూర్ పింక్ పాంథర్ జట్టుకు కూడా హెడ్ కోచ్ గా పనిచేస్తున్నాడు శ్రీనివాస్ రెడ్డి. త్వరలోనే మరింతమంది తెలంగాణ ఆటగాళ్లకు PKLలో అవకాశం దక్కుతుందని చెబుతున్నాడు శ్రీనివాస్ రెడ్డి.

ఏషియన్ గేమ్స్ లో పాల్గొనే భారత జాతీయ జట్టులో స్థానం సంపాదించిన హుస్నాబాద్ బిడ్డ మల్లేష్ ది మరో నేపథ్యం. పేద కుటుంబంలో పుట్టిన గంగాధర్ మల్లేష్… చిన్నతనం నుంచే కబడ్డీపై ఇష్టం పెంచుకున్నాడు. ప్రో కబడ్డీ ప్లేయర్ గా పేరు సాధించాడు. గల్లీ ప్లేయర్ నుంచి ఇండియన్ కబట్టీ టీమ్ లో చోటు సంపాదించే వరకు… గంగాధర్ మల్లేష్ జీవితంలో ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు ఎదురయ్యాయి. పుట్టింది పేద కుటుంబంలో… చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. కూలీ చేసుకుంటూనే కుటుంబాన్ని పోషించింది తల్లి. పేదరికంలోనూ ఏనాడూ కబడ్డీని వదల్లేదు మల్లేష్. అండర్-19 జాతీయ కబడ్డీ పోటీల్లో పాల్గొని సత్తా చాటాడు. చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, చెన్నై, మధురలో జరిగిన నాలుగు జూనియర్ నేషనల్ స్థాయి కబడ్డీ పోటీలు.. హైదరాబాద్, కేరళ, తమిళనాడు, కర్ణాటకలలో జరిగిన సీనియర్ జాతీయ కబడ్డీ పోటీల్లో పాల్గొని తానేంటో నిరూపించుకున్నాడు. డొమెస్టిక్ కబడ్డీలో మంచి టాలెంట్ చూపించడంతో… మల్లేష్ కు ప్రో కబడ్డీ లీగ్ లో ఆడే అవకాశం వచ్చింది. ఈ ఏడాది ప్రోకబడ్డీ లీగ్ లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టుకు ఆడిన మల్లేష్… తాజాగా ఏషియన్ గేమ్స్ కు ఎంపికయ్యాడు. ఏషియన్ గేమ్స్ లో పాల్గొనే భారత జట్టులో దక్షిణ భారతం నుంచి సెలెక్ట్ అయిన వన్ అండ్ ఓన్లీ ప్లేయర్ మల్లేష్. ఆగష్టు 18 నుంచి ఇండోనేషియాలో జరిగే ఏషియన్ గేమ్స్ లో భారత్ గోల్డ్ మెడల్ గెలుస్తుందని ధీమాగా చెబుతున్నాడు మల్లేష్.

తెలంగాణ నుంచి శ్రీనివాస్ రెడ్డి అంతర్జాతీయ స్థాయి కబడ్డీ కోచ్ గా ఎదిగితే… మల్లేష్ ఇండియన్ టీమ్ లో చోటు దక్కించుకున్నాడు. ఈ మధ్యే దుబాయిలో జరిగిన మాస్టర్స్ కప్ లో భారత జట్టు విజేతగా నిలవడంలో కీ-రోల్ పోషించిన శ్రీనివాస్ రెడ్డి… త్వరలో జరగబోయే ఏషియన్ గేమ్స్ లోనూ భారత జట్టును విజేతగా నిలపాలని కోరుకుందాం.

Posted in Uncategorized

Latest Updates