ఇళ్లు కాదు ఇంద్రభవనం : పురుషోత్తముడు కాదు.. కుబేరుడు

purushottam

అవినీతి కేసులో ఏసీబీ అధికారులకు చిక్కిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ పురుషోత్తం రెడ్డి లైఫ్ స్టైల్ అంతా రిచ్. ఇంట్లో వాడే ప్రతీ వస్తువు ఖరీదైనదే. మద్యం బాటిళ్లు సైతం విదేశాల నుంచి వచ్చినవే. బంగారు నగల డిజైన్లు చూస్తే కళ్లు తిరగాల్సిందే. వీటితోపాటు భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ బంజారాహిల్స్ సాగర్  సొసైటీలోని పురుషోత్తంరెడ్డి ఇంట్లో జరిగిన సోదాలు కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బయటపడ్డాయి.

తవ్వేకొద్దీ బయటకొస్తున్నాయి :

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో HMDA మాజీ డైరెక్టర్ పురుషోత్తమ్ రెడ్డి అక్రమాస్తులు తవ్వేకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న పురుషోత్తంను కస్టడీలోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. సాగర్ సొసైటీలో సీజ్ చేసిన ఇంటిని అతనితోపాటు, అతని భార్య, కూతురు సమక్షంలో తెరిచి సోదాలు చేశారు. భారీగా బంగారం, వజ్రాభరణాలతో పాటు 12 లీటర్ల ఖరీదైన మద్యం సీసాలు, విలువైన గృహోపకరణాలను గుర్తించారు. వీటి విలువ మొత్తం 60 లక్షలకు పైగా ఉంటుంది.

ఆస్తులు చూసి అధికారులు షాక్ :

సోదాల్లో వజ్రాలు పొదిగి ఉన్న బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు చూసి అధికారులు నోరెళ్లబెట్టారు. లక్షా 10వేల నగదు, 9వేల విలువైన పాతనోట్లు, 501 యూఎస్ డాలర్లు, 265 యూఏఈ కరెన్సీ, 20 లక్షల విలువచేసే పట్టుచీరలు సీజ్ చేశారు. అల్మారాలో దాచిన విదేశీ మద్యం బాటిళ్లు, క్రెడిట్ కార్డు బిల్లులు, కొన్ని విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. పురుషోత్తమ్ రెడ్డి నివాసంలో అత్యాధునిక సౌకర్యాలు చూసి ఏసీబీ అధికారులు నోరెళ్లబెట్టారు. మొదటి అంతస్తులోకి వెళ్లడానికి లిఫ్ట్, ఖరీదైన ఫర్నిచర్, కాస్ట్ లీ టీవీలు ఉన్నాయి. దాడులు ముందే ఊహించి.. కొన్ని విలువైన డాక్యుమెంట్లు, అతి ఖరీదైన వస్తువులు తరలించినట్టు అనుమానిస్తున్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates