ఇవాల్టి నుంచే పెట్రో, డీజిల్ ట్యాంకర్ల బంద్

 పెట్రోలు, డీజిల్‌ ట్యాంకర్లను ఇవాల్టి(మంగళవారం) నుంచి నిలిపివేస్తామని, విమానాశ్రయానికి సైతం ఇంధనాన్ని బంద్‌ చేస్తామని వెల్లడించింది రాష్ట్ర లారీ యజమానుల సంఘం. న్యాయమైన తమ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే తెలంగాణలో లారీల సమ్మెను ఉద్ధృతం చేస్తామని రాష్ట్ర లారీ యజమానుల సంఘం హెచ్చరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి వినతి పత్రం అందజేసింది రాష్ట్ర లారీ యజమానుల సంఘం. పాలు, నీళ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసర సరకుల సరఫరానుకూడా ఆపివేస్తామన్నారు లారీ యజమానుల సంఘం నేతలు. లారీల సమ్మెపై కేంద్రం నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు సంఘం గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌. సింగిల్‌ పర్మిట్‌ విధానంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ అంగీకారం తెలిపినా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించడం లేదని శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు.

శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో సోమవారం సచివాలయంలో లారీ యజమానుల, పెట్రోలియం ట్రక్కు యజమానుల సంఘాల ప్రతినిధులు భాస్కర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, దుర్గాప్రసాద్‌, రాజేందర్‌రెడ్డి, సలీం, సయ్యద్‌ అరిఫ్‌ హుస్సేన్‌,   ప్రసాద్‌, మూర్తి సీఎస్‌ను కలిశారు. లారీల నిర్వహణ కష్టసాధ్యంగా మారిందని, పన్నులు పెరిగాయని, టోల్‌భారం ఎక్కువైందని, సింగిల్‌ పర్మిట్‌ విధానం లేక రెండు రాష్ట్రాల్లోనూ పన్నులు చెల్లించాల్సి వస్తోందని వెల్లడించారు. లారీ యజమానుల సమస్యలపై ప్రభుత్వం సానుభూతితో ఉందని, వీటిని పరిష్కరించాలని కేంద్రానికి నివేదిస్తామన్నారు సీఎస్‌ జోషి. ఏపీ ప్రభుత్వంతోనూ చర్చించి, సింగిల్‌ పర్మిట్‌కు అనుమతి లభించేందుకు చొరవ తీసుకుంటామన్నారు ఆయన.

Posted in Uncategorized

Latest Updates