ఇవాళే ఉత్తర్వులు : ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధం

EMPLOYEES TRANSFER TSతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు బుధవారం (జూన్-13) నుంచి  బదిలీ ఉత్తర్వులు అందుకోనున్నారు. 90 శాతం బదిలీ ఉత్తర్వులు జూన్ 15న జారీకానున్నాయి. ఎక్కువశాతం ఉద్యోగులు జూన్18న, కొత్త ప్రదేశాల్లో కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు. రంజాన్, ఆదివారం సెలవురోజులు కలిసి రావడంతో ఉద్యోగులు కొత్త బాధ్యతలను చేపట్టేందుకు వెసులుబాటు లభించింది.

40 వేల మంది ఉద్యోగులకు స్థానచలనం తప్పదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు ఉద్యోగసంఘాల JAC నాయకులు పూర్తిస్థాయిలో సహకారాన్ని అందిస్తున్నారు. మినహాయింపులను కూడా కుదించుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఒకే ప్రదేశంలో ఐదేండ్లకన్నా ఎక్కువ సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగులు 50 వేల వరకు ఉన్నారు. ఉద్యోగ సంఘాలపైన, నాయకులపైన, అధికారులపైన విమర్శలు వస్తున్నప్పటికీ, ప్రతీ శాఖలో ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు పారదర్శకతకు, జవాబుదారీతనానికి ప్రాధాన్యమిస్తున్నారు.

ప్రతీ ఉద్యోగి నుంచి బదిలీ కోరుకునే ఐదు ప్రదేశాల పేర్లను తీసుకున్నారు. స్పౌజ్, దీర్ఘవ్యాధిగ్రస్థులు, దివ్యాంగులు, ఇతర మినహాయింపులతో దరఖాస్తులు చేసుకున్నవారి లిస్టులను ప్రత్యేకంగా రూపొందించారు. స్పౌజ్ నిబంధనల ప్రకారం దరఖాస్తులు ఇచ్చినవారి విషయంలో అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. స్థానికసంస్థలలో, కేంద్రప్రభుత్వ పరిధిలో, కేంద్రప్రభుత్వ అండర్‌ టేకింగ్ సంస్థలలో తమ సహచరులు పనిచేస్తున్నట్టుగా స్పౌజ్ నిబంధనల్లో అనేకమంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని పబ్లిక్‌ సెక్టార్, IT సెక్టార్లలోని ఉద్యోగులు స్పౌజ్ నిబంధనల ప్రకారం హైదరాబాద్ బదిలీకి దరఖాస్తులు చేసుకున్నట్టు తెలుస్తున్నది.  ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని బదిలీలకోసం ఇచ్చిన నిబంధనల్లో ఉల్లంఘనలు జరిగినట్టయితే సంబంధిత శాఖాధిపతులు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది ప్రభుత్వం.

సెకండ్‌ గ్రేడ్, హయ్యర్‌ గ్రేడ్ గెజిటెడ్ అధికారులకు స్థానికతను బట్టి పాతజిల్లా కేంద్రాల పరిధిలో అవకాశం ఇస్తారు. రాష్ట్రపతి ఉత్తర్వులను, జిల్లా, జోనల్, మల్టీజోనల్ విధానాలను పరిగణనలోకి తీసుకుంటారు. వ్యవసాయం, సహకారశాఖ, బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్, పశుసంవర్ధక, సమాచార, దేవాదాయ, ఉద్యానవన, ఉపాధికల్పన, కార్మిక, RTA తదితర శాఖల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. కొన్ని శాఖల్లో సీనియారిటీ జాబితాల్లో పొరపాట్లు దొర్లినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఏపీ మూలాలు ఉన్న అధికారులు ఉన్నచోట్ల తెలంగాణ ఉద్యోగులకు న్యాయం జరుగదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిమోట్ ఏరియాల నుంచి ఎక్కువమంది పట్టణాలకు వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తున్నది. ఒక ప్రదేశం నుంచి ఎంతమంది ఉద్యోగులు బదిలీలు కోరుకుంటున్నారో, అంతే సంఖ్యలో ఆ ప్రదేశానికి బదిలీచేసేలా కార్యాచరణను రూపొందించారు.

 

 

 

Posted in Uncategorized

Latest Updates