ఇవాళ్టి నుంచి వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో మొదటి సారిగా ఇండియా నుంచి ఎక్కువ మంది షట్లర్లు తమ సత్తా చాటేందుకు పోటీపడుతున్నారు. పోటీలో చాలా మంది ప్లేయర్లు ఉన్నా …. ఒలింపిక్‌ పతక విజేతలు సైనా, సింధుతోపాటు శ్రీకాంత్‌, ప్రణయ్‌ పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు క్రీడాభిమానులు.

సోమవారం నుంచి జరిగే వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో  భారత ప్లేయర్లు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. పోటీ ఎలా ఉన్నా.. ప్రత్యర్థుల రికార్డు మెరుగ్గా ఉన్నా అవకాశం వస్తే ఈసారి కచ్చితంగా పసిడితోనే తిరిగి రావాలని పట్టుదలతో ఉన్నారు. 2013, 14లో కాంస్యాలతో సరిపెట్టుకున్న సింధు.. గతేడాది తృటిలో పసిడిని కోల్పోయింది. 110 నిమిషాల ఫైనల్లో ఒకుహర చేతిలో ఓడిపోయింది. ఈసారి అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయొద్దని భావిస్తున్న సింధుకు మేజర్ ఫైనల్స్‌లో ఓడటం కూడా ఒకింత ఆందోళన కలిగించే అంశం. అన్ని అనుకున్నట్లుగా జరిగితే మూడోరౌండ్‌లో సింధు.. సుంగ్ జి హున్ (కొరియా)తో, క్వార్టర్స్‌లోఒకుహరతో తలపడే అవకాశాలున్నాయి. ఇక 2015లో రజతం, 17లో కాంస్యంతో సరిపెట్టుకున్న సైనా కూడా మంచి దూకుడు మీద ఉంది. సబ్రినా లేదా దిమిర్బాగ్‌తో మొదటి మ్యాచ్ ఆడనున్న సైనాకు మూడోరౌండ్‌లో రచ్చనోక్ ఎదురుకావొచ్చు. క్వార్టర్స్‌లో మారిన్ అడ్డంకిని అధిగమిస్తే ఫైనల్ వరకు ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చు.

పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌పై భారీ అంచనాలున్నాయి. తొలి రౌండ్‌లో ఎంగుయాన్ (ఐర్లాండ్)తో తలపడనున్నాడు. మూడోరౌండ్‌లో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేషియా)ని అధిగమిస్తే.. తర్వాత అడ్డంకులు పెద్దగా ఉండకపోవచ్చు. లీ చోంగ్ వీ (మలేసియా) అనారోగ్యం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో శ్రీకాంత్ పతకం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Posted in Uncategorized

Latest Updates