ఇవాళ్టి నుంచే ఫ్రీ పార్కింగ్

హైదరాబాద్ ప్రజలకు పార్కింగ్ సమస్యలనుంచి గట్టెక్కించడంతో పాటు.. షాపింగ్‌ మాల్స్‌,మల్టీప్లెక్స్‌లు .. ఇతరత్రా వాణిజ్య ప్రదేశాల్లో పార్కింగ్‌ దోపిడీకి చెక్‌ పెట్టింది ప్రభుత్వం. గంటల లెక్కన పార్కింగ్‌ ఫీజుల వసూలు నుంచి నగర ప్రజలకు ఉపశమనం లభించనుంది. ఇకపై మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో తొలి అరగంట వరకు పార్కింగ్‌ ఫ్రీ. ఆ తర్వాత పార్కింగ్‌ చేసే సమయం.. నిబంధనలను బట్టి పార్కింగ్‌ ఫీజు వసూలు చేయనున్నారు. వాణిజ్య ప్రాంతాలు, షాపింగ్‌ మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో పార్కింగ్‌ ఫీజుల్ని క్రమబద్ధీకరిస్తూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఆదివారం(ఏప్రిల్-1) నుంచి నిబంధనలకు అనుగుణంగా మాత్రమే పార్కింగ్‌ ఫీజుల్ని వసూలు చేయాలి. అలా కాకుండా ఇష్టానుసారం వసూలు చేసే వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకునే అధికారం GHMCకి ఉంది. మాల్స్, మల్టీప్లెక్స్‌ల యజమానులతో జీహెచ్‌ఎంసీ సమావేశం నిర్వహించి స్పష్టం చేసింది. పార్కింగ్‌ పాలసీని మాత్రం కచ్చితంగా అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పింది.

కొత్త పార్కింగ్ ఛార్జీలు:

మొదటి అర గంట (30 నిమిషాలు) : ఎలాంటి పార్కింగ్ ఫీజు ఉండదు. వసూలు చేయకూడదు. ఉచితంగా పార్కింగ్ ఉంటుంది. ఎంట్రీ – ఎగ్జిట్ దగ్గర టైం చూసి ఫ్రీ పార్కింగ్ అనుమతికి అవకాశం ఇస్తారు.

31 నుంచి 60 నిమిషాల వరకు : మాల్స్, మల్టీఫ్లెక్స్ లు, వాణిజ్య సముదాయాల్లోకి వెళ్లిన తర్వాత ఏదైనా వస్తువు కొనుగోలు చేసినట్లు బిల్లు చూపిస్తే పార్కింగ్ ఫ్రీ. ఎలాంటి వస్తువు కొనుగోలు చేయకపోతే ఫీజు వసూలు చేస్తారు.

గంట తర్వాత (60 నిమిషాలు పైన) : సినిమా టికెట్ లేదా షాపింగ్ బిల్లు చూపిస్తే ఎలాంటి ఫీజు ఉండదు. అయితే ఓ కండీషన్ ఉంది. సినిమా టికెట్ లేదా షాపింగ్ బిల్లు పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు ఫీజు వసూలు చేయరు. అలా కాకుండా సినిమా టికెట్ రూ.150 ఉండి.. పార్కింగ్ ఫీజు 170 ఉంటే.. పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Posted in Uncategorized

Latest Updates