ఇవాళ కోదాడలో ప్రజాఫ్రంట్ బహిరంగ సభ


హైదరాబాద్ : ఎన్నికల ప్రచారానికి ఇవాళ(బుధరవారం) చివరి రోజు కావడంతో ప్రజాఫ్రంట్ మరో బహిరంగ సభను కోదాడలో నిర్వహిస్తోంది. ఉమ్మడి నల్లగొండలోని కోదాడలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహల్‌గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ జన సమితి అధినేత కోదండరామ్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, ప్రజా గాయకుడు గద్దర్‌ కూడా హాజరుకానున్నారు. కోదాడ బహిరంగ సభ తర్వాత సాయంత్రం రాహుల్‌, చంద్రబాబుతో పాటు ప్రజా కూటమి నేతలు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ హోటల్‌లో ఉమ్మడిగా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశం ద్వారా ఎన్నికల సందేశాన్ని మరోసారి ప్రజలకు వివరించనున్నారు. రాహుల్‌గాంధీ ఢిల్లీ నుంచి విజయవాడకు వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గాన కోదాడకు రానున్నారు. కోదాడ నియోజక వర్గం నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతి పోటీ చేస్తున్నారు.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నిల ప్రచారంలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో రెండు పర్యాయాలు పర్యటించారు. కొన్ని బహిరంగ సభలకు రాహుల్‌ ఒక్కరే హాజరుకాగా ఖమ్మంతో పాటు నగరంలోని వివిధ నియోజక వర్గాల్లో రోడ్‌ షోలు నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు గత ఐదారు రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేసి నగరంలో విస్తృతంగా పర్యటించారు. బుధవారం కోదాడలో జరిగే బహిరంగ సభకు ప్రజా కూటమిలోని అగ్రనేతలందరూ హాజరవుతున్నారు. కోదాడ ఏపీ సరిహద్దులో ఉండటమే కాకుండా సూర్యాపేట, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, నాగార్జున సాగర్‌లో సెటిలర్స్‌ ఎక్కువగా ఉంటారు. అందుకు ఏపీ సీఎం చంద్రబాబును కూడా రంగంలోకి దింపుతున్నారు. కోదాడలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఉత్తమ్‌తో పాటు ఆ పార్టీ శ్రేణులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కోదాడలో బహిరంగ సభ ముగించుకొని ఫ్రంట్ లోని అగ్రనేతలంతా హైదరాబాదుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆ నేతలంతా హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ హోటల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతారు.

Posted in Uncategorized

Latest Updates