ఇవాళ దేశ వ్యాప్తంగా బ్యాంకులు బంద్

వేతన సవరణను వెంటనే అమలు చేయాలని కోరుతూ ఇవాళ (బుధవారం) ఒక్క రోజు సమ్మెకు దిగనున్నారు బ్యాంకు ఉద్యోగులు. దీంతో ఇవాళ అన్ని ప్రభుత్వ బ్యాంకులలో సేవలు నిలిచిపోనున్నాయి. వేతన సవరణ సహా బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్. నవంబర్ తో వేతన సవరణ ముగిసిందని… వెంటనే వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు యూనియన్ నేతలు.

అటు బ్యాంకుల విలీన ప్రక్రియను కూడ వ్యతిరేకిస్తున్నారు బ్యాంకు ఉద్యోగులు. దేనా బ్యాంక్, విజయా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా లను మెర్జ్ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు తామూ వ్యతిరేకమంటున్నారు యూనియన్ నేతలు. గతంలో చేపట్టిన ఎస్పీఐ అనుబంధ బ్యాంకుల విలీనంతో కస్టమర్స్, ఉద్యోగులు, బ్యాంకులు నష్టపోయాయే తప్ప ఎలాంటి లాభం లేదంటున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా జరగనున్న సమ్మెలో 10లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు పాల్గొంటున్నట్లు చెప్పారు.

వేతన సవరణ విషయమై యూనియన్ నేతలు, ఇండియన్ బ్యాంకర్స్ అసోషియేషన్ మధ్య ఇప్పటికే 14 సార్లు చర్చలు జరిగాయి. అయినప్పటికీ ఎలాంటి ముందడుగు పడలేదు. చివరగా 2012లో 15 శాతం వేతన సవరణ చేశారు. తర్వాత 2017లో 15 శాతానికి పైగా పెంచాలని యూనియన్ నేతలు కోరినప్పటికీ…బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయంటూ తిరస్కరించింది బ్యాంకర్స్ అసోషియేషన్. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాన్ని డిమాండ్ చేస్తున్నారు యూనియన్ నేతలు. వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు ఉండేలా చట్టం తీసుకురావాలని కోరుతున్నారు. సమ్మెకు అన్ని యూనియన్స్ మద్దతు తెలిపాయి.

Posted in Uncategorized

Latest Updates