ఇవాళ నిజామాబాద్‌ లో కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం


TRS పార్టీ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి  శంఖారావం పూరించారు. ఇందులో భాగంగా ఇవాళ(బుధవారం) ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రచారంలో భాగంగా మధ్యాహ్నం 3 గంటలకు ఇందూరులో జరిగే ‘ప్రజా ఆశీర్వాద’ సభలో కేసీఆర్‌ పాల్గొననున్నారు. ప్రజా ఆశీర్వాద సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. సభ వేదికపై 80 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. గిరిరాజ్‌ కాలేజీ గ్రౌండ్ దగ్గర 20 ఎకరాల స్థలంలో సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో పది ఎకరాలు  సభకు, మరో 10ఎకరాలు పార్కింగుకు కేటాయించారు. హైదరాబాద్‌ నుంచి ఒంటి గంటకు కేసీఆర్‌ హెలికాప్టర్‌లో బయల్దేరతారు. రెండు గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు.

ప్రతి నియోజకవర్గం నుంచి 30 వేల కంటే ఎక్కువ మందిని తరలించేందుకు సన్నాహాలు చేసింది TRS పార్టీ. ప్రతి గ్రామం భారీ సంఖ్యలో వాహనాల్లో కార్యకర్తలు, ప్రజలను తరలించనున్నారు. సభాప్రాంగణంతో పాటు నగరం నలువైపులా పెద్దఎత్తున జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

అసెంబ్లీ రద్దు తర్వాత గతనెల 7వ తేదీన హుస్నాబాద్‌లో మొదటి బహిరంగ సభను నిర్వహించిన కేసీఆర్‌ మళ్లీ 25 రోజుల తర్వాత సభలో పాల్గొంటున్నారు. గత ఎన్నికల్లో 9 అసెంబ్లీ,2 ఎంపీ స్థానాలను గెలిచి, పార్టీ ప్రాబల్యాన్ని చాటిన ఇందూరుపై కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో రెండో ఎన్నికల సభను అక్కడే నిర్వహించాలని నిర్ణయించారు. తర్వాత ఆయన ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన నల్గొండ, వనపర్తి, వరంగల్‌, ఖమ్మం సభలకు హాజరు కానున్నారు. గతంలో హుస్నాబాద్‌ సభ ఒకే నియోజకవర్గానికి పరిమితం కాగా.. ఇందూరు నుంచి పూర్వ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాలతో కలిసి సభ జరపనున్నారు.

Posted in Uncategorized

Latest Updates