ఇసుక గర్భంలో ఇన్నాళ్లు : 34 ఏళ్ల క్రితం కొట్టుకుపోయిన లారీ.. ఇప్పుడు బయటపడింది

34-lorry-foundమూడు దశాబ్దాల కింద భారీ వరదల్లో గల్లంతైన లారీ ఇంతకాలానికి బయటపడింది. నలుగురు వ్యక్తులతో సహా వాగులో కూరుకుపోయిన  లారీని బయటికి తీశారు కరీంనగర్ జిల్లా పోలీసులు. లారీ క్యాబిన్ లో అస్థికలను గుర్తించి డీఎన్ఏ టెస్టులకు పంపించారు. దుర్శేడు గ్రామంలో ఇరుకుల్ల వాగు దగ్గర తవ్వకాలు జరిపిన పోలీసులు.. లారీ శకలాలను బయటకు తీశారు. వివరాల్లోకి వెళితే..

కరీంనగర్ జిల్లాలో 1984న భారీ వర్షాలకు వరదలు వచ్చాయి. జూలై 23న దుర్శేడు గ్రామంలో ఉన్న ఇరుకుల్ల వాగు పాత వంతెనపై నీళ్లు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆ సమయంలోనే శంకరపట్నం మండల కేంద్రానికి చెందిన ఓ లారీ ఇరుకుల్ల వంతెన దాటుతుండగా  నీటి ఉద్ధృతికి వాగులో కొట్టుకుపోయింది. లారీలో ఉన్న నలుగురు గల్లంతయ్యారు. ఇందులో ఒకరి మృతదేహం అప్పుడే నాలుగు కిలో మీటర్ల దూరంలో దొరికింది. ఆ తర్వాత లారీ కోసం గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది.

అప్పుడు గల్లంతైన లారీ ఇన్నాళ్లకు బయటపడింది. ఇరుకుల్ల వాగులో ఇసుక తవ్వుతున్న కూలీలకు లారీ శకలాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో తవ్వకాలు జరిపిన రెవెన్యూ, పోలీసు అధికారులు లారీ క్యాబిన్, గల్లంతయిన వారి దుస్తులు, ఎముకలను గుర్తించారు. ఎముకలను డీఎన్ఏ టెస్టుల కోసం పంపి.. పరీక్షల తర్వాత వారి కుటుంబాలకు అప్పగించనున్నారు. లారీ ఆచూకి దొరికిందన్న సమాచారంతో అప్పట్లో గల్లంతైన వారి కుటుంబీకులు వాగు దగ్గరికి చేరుకున్నారు. 34  ఏళ్ల కింద కొట్టుకుపోయిన లారీ తిరిగి బయటపడటంతో.. తమ వారిని తలచుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 34 ఏళ్ల కింద కొట్టుకుపోయిన లారీతోపాటు.. చనిపోయిన వారి అస్తికలు బయటపడటం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. లారీ పూర్తిగా బయటకు రాకపోవడంతో.. మిగిలిన భాగాలను కూడా వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.

 

Posted in Uncategorized

Latest Updates