ఈవీఎంలకు ’స్ట్రాంగ్’ సెక్యూరిటీ

హైదరాబాద్‌‌: అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంల్లోకి చేరింది. డిసెంబర్ 11న జరిగే కౌంటింగ్‌ వరకు వీటికి హై సెక్యూరిటీ  ఏర్పాటు చేశారు. శుక్రవారం పోలింగ్‌ ముగిసిన  వెంటనే అధికారులు వీటిని స్ట్రాంగ్‌రూమ్‌లకు చేర్చారు. ఈవీఎంలతోపాటు అదనంగా ఉంచిన రిజర్వు ఈవీఎంలూ స్ట్రాంగ్‌ రూమ్స్‌కు చేరాయి. రూమ్స్‌ లోపల, బయట సీసీ కెమెరాలతోపాటు కేంద్ర, రాష్ట్ర బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నిరంతరం కరెంట్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నారు.

అక్కడికి వంద మీటర్ల పరిధిలోకి ఎవరినీ అనుమతించటం లేదు. ఆ పరిసరాల్లోకి వచ్చే వారిని వీడియో తీస్తున్నారు. మూడు షిఫ్టుల్లో 13 మంది పోలీసులు డ్యూటీలో ఉంటున్నారు. స్ట్రాంగ్‌ రూమ్స్‌ దగ్గర సీసీ కెమెరాలను ఆయా జిల్లాల ఎస్పీ ఆఫీసుల కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు  కనెక్ట్ చేశారు. రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) రోజుకోసారి పోలీసు ఉన్నతాధికారితో కలిసి స్ట్రాంగ్‌ రూమ్‌ను సందర్శించి జిల్లా ఎన్నికల అధికారి (డీఈవో) ద్వారా సీఈవో రజత్‌కుమార్‌కు రిపోర్టు పంపిస్తారు.

కౌంటింగ్‌కు చకచకా ఏర్పాట్లు

పోలింగ్‌ పూర్తవ్వడంతో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై ఎన్నికల యంత్రాంగం దృష్టి పెట్టింది. డిసెంబర్ 11న ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. కౌంటింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్‌ను ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్‌, హైదరాబాద్‌ నుంచి సీఈవో రజత్‌కుమార్‌ పర్యవేక్షిస్తారు. ప్రతి  సెంటర్‌లో కనీసం 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. ప్రతి టేబుల్ దగ్గర ఏజెంట్లు, సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్లు, సర్వీస్‌ ఓట్లను కౌంట్ చేస్తారు. కౌంటింగ్ పూర్తయ్యాక  క్రాస్‌ చెకింగ్‌ కోసం ఏదో ఒక పోలింగ్‌ బూత్‌కు సంబంధించిన వీవీ ప్యాట్‌‌ స్లిప్‌లను, ఆ బూత్‌లో అభ్యర్థికి వచ్చిన ఓట్లు లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో  45 కౌంటింగ్‌ సెంటర్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.

Posted in Uncategorized

Latest Updates