ఈ నెల 25 నుంచి ఉద్యోగుల బదిలీలు

Telangana_State_Emblem_White_2000x2000తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ఉద్యోగులందరినీ బదిలీ చేసేందుకు మే 25 నుంచే బదిలీలను మొదలుపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీల కసరత్తు మొదలైంది. మే 25 నుంచి జూన్‌ 15 లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. బదిలీల మార్గదర్శకాల రూపకల్పనకు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ మిశ్రా సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి గురువారం (మే-17) ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అధర్‌ సిన్హా సభ్యుడిగా, ఆర్థిక ముఖ్య కార్యదర్శి ఎన్‌.శివశంకర్‌ మెంబర్‌ కన్వీనర్‌గా ఉన్నారు. బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను పది రోజుల్లో సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సంప్రదింపులు జరిపి మార్గదర్శకాలు సిద్ధం చేయాలని నిర్దేశించింది. కమిటీ గురువారం నుంచే కసరత్తు ప్రారంభించింది. అజయ్‌ మిశ్రా అందుబాటులో లేకపోవటంతో అధర్‌ సిన్హా ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సచివాలయంలో కాసేపు సమావేశమయ్యారు. బదిలీల మార్గదర్శకాలకు అనుసరించాల్సిన రూట్‌ మ్యాప్‌ పై చర్చించారు. గతంలో ఉన్న నిబంధనలు కట్టుదిట్టంగా ఉన్నాయని, వాటినే ఈసారి అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రతిపాదించారు. శుక్రవారం (మే-18) అజయ్‌ మిశ్రా నేతృత్వంలో జరిగే సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చ జరిగే అవకాశాలున్నాయి.

Posted in Uncategorized

Latest Updates