ఈ పాపం ఎవరిది : పంట అమ్ముకోలేక.. ఎండకు తట్టుకోలేక ఓ రైతు మృతి

papamఆరుగాలం కష్టపడి పండించిన పంట.. రాత్రి పగలు పొలంలోనే ఉండి పండించిన పంట.. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో నేలపాలు అవుతుంది. పండించిన పంటకు కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. అన్నదాతల ఉసురు తీస్తున్నారు కొందరు అధికారులు. మధ్యప్రదేశ్ రాష్ట్రం లతేరి మార్కెట్ యార్డులో జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పంటను అమ్మడానికి వచ్చి.. ఎండలో నాలుగురోజులు కూర్చోవడంతో 65 ఏళ్ల మల్ చంద్ అనే రైతు ప్రాణాలు కోల్పోయాడు. మల్ చంద్ కుమారుడు నర్మదా ప్రసాద్, స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పంటను అమ్మేందుకు లతేరి వ్యవసాయం మార్కెట్ కు వెళ్లాడు మల్ చంద్ అనే రైతు. ఆ ఏరియాలో ఎండ తీవ్రత 42, 43 డిగ్రీలుగా ఉంది. యార్డుకు వచ్చిన పంటను ఎవరూ కొనుగోలు చేయలేదు. నాలుగు రోజులు అక్కడే పడిగాపులు కాశారు రైతులు. మల్ చంద్ తోపాటు.. రైతులందరూ పంటను అమ్మి.. ఈ డబ్బుతోనే ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మండే ఎండలు ఓ వైపు.. అధికారుల నిర్లక్ష్యం మరో వైపు.. అన్నదాతను ఎవరూ పట్టించుకోలేదు. అక్కడే నాలుగు రోజులు క్యూలో నిలబడ్డారు రైతులు. దీంతో ఎండ తీవ్రతకు తట్టుకోలేక 65 ఏళ్ల మల్ చంద్ అనే రైతు మార్కెట్ యార్డులోనే కుప్పకూలిపోయాడు. పంటపై అలాగే ప్రాణాలు విడిచాడు.

ఇక్కడ మరో విషాదమైన సమాచారం కూడా బయటకు వచ్చింది. యార్డుకు పంటను తీసుకొచ్చిన రైతు మల్ చంద్ దగ్గర.. కనీస ఆహారం తీసుకోవటానికి అవసరం అయిన డబ్బు కూడా లేదు. దీంతో ఆయన నాలుగు రోజులుగా పస్తులతోనే ఉంటున్నాడు. చనిపోయిన తర్వాత వైద్యులు ఇదే విషయాన్ని చెప్పారు. కొన్నిరోజులుగా రైతు మల్ చంద్ ఆహారం కూడా తీసుకోవడం లేదని.. ఈ విషయం అందర్నీ కన్నీళ్ల పర్యంతం చేస్తోంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రం లతేరి మండి (మార్కెట్ యార్డు)లో మల్ చంద్ మృతితో మిగతా రైతులు ఆందోళనకు దిగారు. యార్డు గేట్లు మూసివేసి అధికారులు, సిబ్బందిని నిర్బంధించారు. దీంతో స్ధానిక తహసిల్దార్ శతృఘ్నణ్ సింగ్ చౌహాన్, ఇతర ఉన్నతాధికారులు ఘటనాస్ధలికి చేరుకున్నారు. రైతులతో చర్చించారు. మల్ చంద్ ఫ్యామిలీకి రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. యార్డు గైడ్ లైన్స్ ప్రకారం రూ.4 లక్షలు మాత్రమే ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మిగతా రైతుల పంటను వెంటనే కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దేశంలో రైతుల దుస్థితిని ఈ ఘటన మరోసారి కళ్లకు కట్టింది.

Posted in Uncategorized

Latest Updates