ఈ సినిమా చూసైనా ఖైదీ మారాలి

 నేరం చేస్తే… ఎంతటి వాళ్లైనా కటకటాలపాలు కావాల్సిందే. అయినంత మాత్రాన వాళ్లలో మార్పు వస్తుందా అంటే… అదీ చెప్పలేం. కానీ వాళ్లలో మార్పు రావడానికే ఏ శిక్షైనా…. కాదంటారా! అచ్చం అలాగే భావించింది అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలోని ఒక న్యాయస్థానం. అక్రమంగా జింకలను వేటాడుతూ… అన్యాయంగా వాటిని చంపుతున్న ఒక నేరస్తుడికి తగిన శిక్ష వేసింది. మూగజీవులనే కనికరం లేకుండా వాటిని నిర్దాక్షిణ్యంగా చంపుతున్న నేరస్తుడు డేవిడ్‌ బెర్రీ. ఇకపై బెర్రీ తాను జైల్లో ఉన్నంతకాలం, కచ్చితంగా నెలకొకసారైనా డిస్నీ సంస్థ నిర్మించిన ‘బాంబీ’ సినిమా చూడాలని తీర్పునిచ్చారు . ఈనెల 23వ తేదీ లోపు అతను ఈ సినిమాను కచ్చితంగా చూడాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించింది. బాంబీ 1942లో విడుదలైన అమెరికన్‌ యానిమేటెట్‌ సినిమా. ఇందులో ఒక జింక పిల్ల జీవితం అందర్నీ కంటతడి పెట్టిస్తుంది. అలాగే మనుషుల మీద ఎంతగానో ప్రభావం చూపుతుంది. ఇది చూసైనా ఆ నేరస్తుడిలో పశ్చాత్తాపం మొదలై… ఇకపై జింకలపై అమానుషంగా ప్రవర్తించకూడదని భావించినట్టుంది ఆ కోర్టు. చూడాలి మరి, ఆ సినిమా చూసైనా అతనిలో మార్పు వస్తుందో లేదో! విడుదలయ్యాకైనా మారతాడో లేదో!

Posted in Uncategorized

Latest Updates