ఈ హక్కులు కూడా స్టార్ ఇండియాకే

STARSPORTSఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ప్రసార హక్కులను సొంతం చేసుకున్న స్టార్ ఇండియానే…భారత్‌లో జరిగే అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ల ప్రసారహక్కుల కాంట్రాక్టును దక్కించుకుంది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ-వేలంలో తన ప్రత్యర్థులు సోనీ, రిలయన్స్‌ జియోలను వెనక్కి తోసి హక్కులను సొంతం చేసుకుంది. వేలంలో స్టార్‌ రూ. 6 వేల 138 కోట్ల 10 లక్షలకు హక్కులు గెలుచుకుంది. బుధవారం(ఏప్రిల్-4) రూ. 6,032.5 కోట్ల దగ్గర నిలిచిన వేలం గురువారం(ఏప్రిల్-5) కూడా కొనసాగింది. మరో 105.5 కోట్లు అదనంగా పెరిగిన తర్వాత సోనీ, జియో సంస్థలు పోటీ నుంచి తప్పుకున్నాయి. వేలంలో సోనీ రూ.6118.59 కోట్లు కోట్‌ చేసి ఇదే తమ గరిష్ట మొత్తంగా ప్రకటించేసింది. దాంతో మరింత ముందుకు వెళ్లిన స్టార్‌ విజేతగా నిలిచింది. దీని ప్రకారం వచ్చే ఐదేళ్లలో భారత్‌లో జరిగే మ్యాచ్‌ల ప్రపంచవ్యాప్త టీవీ ప్రసారాలు, డిజిటల్‌ ప్రసారాల గ్లోబల్‌ కన్సాలిడేటెడ్‌ బిడ్‌ (జీసీఆర్‌) స్టార్‌ సొంతమైంది. ఐదేళ్ల క్రితం ఇదే తరహాలో ప్రసార హక్కుల కోసం స్టార్‌ రూ.3,851 కోట్లు చెల్లించింది. దాంతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా 59 శాతం ఎక్కువ విలువ పెరిగింది. లేటెస్ట్ అగ్రిమెంట్ ప్రకారం స్టార్‌ ఒక్కో మ్యాచ్‌ కోసం బోర్డుకు రూ.60.17 కోట్లు చెల్లిస్తున్నట్లు లెక్క. ఇప్పటికే ప్రతిష్టాత్మక IPL హక్కులు కూడా ఉన్న స్టార్‌ భారత క్రికెట్‌పై తమకు ఉన్న పట్టును మరింత పెంచుకుంది. ఐపీఎల్‌లో ఒక్కో మ్యాచ్‌ కోసం అదే స్టార్‌ రూ.54.5 కోట్లు చెల్లిస్తోంది. క్రికెట్‌లోని రెండు ‘అత్యంత విలువైన’ ప్రసార హక్కులతో పాటు ICC టోర్నీల హక్కులు కూడా స్టార్‌ ఇండియావే. తాజా ఒప్పందంలో భారత పురుషుల జట్ల అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు భారత మహిళల క్రికెట్‌ జట్టు ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లు, పురుషుల దేశవాళీ టోర్నీల ప్రసార హక్కులు కూడా స్టార్‌కే చెందుతాయి.

IPL మ్యాచ్‌లను ప్రసారం చేసే విషయంలో స్టార్, దూరదర్శన్‌ మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న వివాదానికి  తెర పడింది. గురువారం(ఏప్రిల్-5) ముగిసిన తుది భేటీ తర్వాత ప్రకటనలో ఆదాయాన్ని చెరి సగం పంచుకునేందుకు రెండు సంస్థలు అంగీకరించాయి.

Posted in Uncategorized

Latest Updates