ఉగ్రవాదకాల్పుల్లో.. తెలుగు జవాను మృతి

JAVAN DEATHజమ్మూ కాశ్మీర్‌ లో ఉగ్రవాదుల కాల్పుల్లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం అత్తిసూరి కవిటి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ సాద గుణాకరరావు (25) వీరమరణం పొందాడు. ఈ మేరకు ఆర్మీ అధికారుల నుంచి ఆయన కుటుంబసభ్యులకు బుధవారం (ఏప్రిల్-11) సమాచారం అందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంటర్‌ పూర్తయిన తర్వాత 2012లో ఆర్మీలో చేరాడు గుణాకరరావు. పంజాబ్‌ లోని పఠాన్‌ కోట్‌ మెయిన్‌ యూనిట్‌ లో లైట్‌ వెహికల్‌ డ్రైవర్‌గా పని చేసేవాడు. అక్కడ్నుంచి శ్రీనగర్‌ రాష్ట్రీయ రైఫిల్‌ విభాగం-1కు బదిలీ అయ్యాడు. జమ్మూ కాశ్మీర్‌ లోని కుల్గామ్‌ జిల్లా కుద్వాని గ్రామం వద్ద ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో మంగళవారం రాత్రి 11.30 గంటలకు ఆర్‌ ఆర్‌ విభాగం-1కు చెందిన సైనికులు వాహనంలో అక్కడకు వెళ్లారు.

ఈ సమయంలో హఠాత్తుగా ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో గుణాకరరావు ఛాతీకి ఎడమ భాగంలో, తల ముందుభాగంలో, కడుపులో, ఎడమ భుజంలో తూటాలు దూసుకెళ్లిపోయాయి. వెంటనే సైనికులు ఎదురు దాడికి దిగారు. ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్ర గాయాలపాలైన గుణాకరరావును 92 బిహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం వేకువజామున 3.30 గంటలకు వీరమరణం పొందాడు. చేతికందివచ్చిన కుమారుడు మృతితో తల్లిదండ్రులు మల్లేశ్వరరావు, జయమ్మతోపాటు ముగ్గురు అక్కా, చెల్లెళ్లు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గుణాకరరావు పార్థివదేహం గురువారం స్వగ్రామానికి చేరుకుంటుందని తెలిపారు స్థానిక తహశీల్దార్‌.

Posted in Uncategorized

Latest Updates