ఉత్తమ్ కు కేటీఆర్ చురకలు : శబ్ధ విప్లవానికి కాంగ్రెస్ గల్లంతు

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త సొల్లు మాట్లాడుతున్నారని విమర్శించారు రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ప్రాజెక్టులపై ఆధారాల్లేకుండా మాట్లాడుతున్నారని.. ఆధారాలుంటే కోర్టుకు వెళ్లొచ్చన్నారు. అంబానీ, అదానీలేంటి.. రాహుల్ గాంధీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, అక్రమంగా సంపాదించాడు అని తాను కూడా విమర్శలు చేయొచ్చన్నారు. కాంగ్రెస్ ది బెయిల్ గాడి అని ప్రధాని మోడీ అన్నది కరెక్ట్ అన్నారు. సోనియా, రాహుల్ ఇద్దరూ బెయిల్ మీద ఉన్నారని చెప్పారు కేటీఆర్.

కాళేశ్వరంతో పంటలకు నీళ్లు.. కాంగ్రెస్ కు కన్నీళ్లే మిగులుతాయన్న కేటీఆర్. దేశం మొత్తం మీద 75 ఎంపీ సీట్లు వస్తాయన్నది ఉత్తమ్ కుమార్ ఉద్దేశం అయినట్లు ఉందని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ ఏ రాష్ట్రంలోనైనా సొంతంగా 20 సీట్లు గెలిచే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఆగలేదన్నారు. అమేథీలో సొంత మున్సిపాలిటీలోనే కాంగ్రెస్ ను రాహుల్ గెలిపించలేకపోయారు.. తెలంగాణకు వచ్చి గెలిపిస్తారా అని కౌంటర్ వేశారు కేటీఆర్. తెలంగాణలో ఉండేవాళ్లంతా తెలంగాణవాళ్లే అనుకుంటున్నామని.. కాంగ్రెస్ నేతలే సెటిలర్లు అని విడదీస్తున్నారన్నారు. కేంద్రంతో ముష్టి యుద్ధాలు చేయలేం కాబట్టే.. ప్రజాస్వామ్య పద్ధతిలో విభజన హామీల గురించి పోరాడుతున్నామన్నారు.

కేంద్రంలో శాసించే పాత్ర ఇవ్వాలని ప్రజలను కోరుతామన్నారు కేటీఆర్. ఎన్నికల వాతావరణం వచ్చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం ఉండదని.. శబ్ద విప్లవానికి కాంగ్రెస్ గూబ గుయ్యిమంటుందన్నారు.  కాంగ్రెస్, టీడీపీ కలిసే ఉంటాయని.. ప్రజలు పార్టీల డ్రామాలను గ్రహిస్తారని చెప్పారు. తాము టికెట్ ఇస్తామంటే.. ఉత్తమ్, జానా తప్ప మిగతా అందరు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరే పరిస్థితి ఉందని.. కొందరు చేరుతామని వస్తున్నా.. తామే వద్దంటున్నామని చెప్పారు కేటీఆర్. కాంట్రాక్టర్లను కాంగ్రెస్ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న ఐటీ మంత్రి.. త్వరలోనే వారిపై కేసులు బుక్ చేస్తామన్నారు. స్పెషల్ ఆఫీసర్ల పాలన తప్పనిసరి అయిందని.. సర్పంచ్ లు అర్థం చేసుకోవాలని కోరారు.

Posted in Uncategorized

Latest Updates