ఉత్తరాదిన భారీ వర్షాలు… ఉత్తరాఖాండ్ లో రెడ్ అలర్ట్

ukరుతు పవనాల ప్రభావంతో ఉత్తరాదిలో భారీ వర్షాలు పడుతున్నాయి. నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొండలపై భారీగా వరద వస్తుండటంతో…. ఉత్తరాఖండ్ లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అటు.. వెస్ట్ బెంగాల్ లోనూ పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి.
ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పితోర్ ఘర్ లోని చాలా ప్రాంతాల్లో కొండలపై నుంచి ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చింది. దీంతో కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రజలెవరికీ గాయాలు కాలేదని అధికారులు ప్రకటించారు. భారీ వరదలతో సేరాఘాట్ డ్యాం కు వరద పోటెత్తింది. దీంతో హైడల్ పవర్ ప్రాజెక్టు కొద్దిగా దెబ్బతిన్నది.
అటు.. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో తెహ్రీలోని బగద్దర్ కుంజాపురి దగ్గర హైవే మూసేశారు అధికారులు. ఉత్తరాఖండ్ లో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. మరో 24 గంటల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని చెప్పింది. చాలా వరకు కొండప్రాంతం కావడంతో.. రోడ్డు బాగున్న మార్గాల్లోనే ప్రయాణించాలని వాహనదారులకు సూచించింది.
వెస్ట్ బెంగాల్ లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో సిలిగురిలో రోడ్లపై భారీగా నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీటమునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నైరుతి రుతుపవనాలు దక్షిణ హిమాలయాలపై చురుగ్గా ఉండటంతో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, బిహార్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లోనూ వానలు పడే అవకాశముందని వాతావరణశాఖ చెబుతోంది.

Posted in Uncategorized

Latest Updates