ఉద్యోగం పేరుతో రూ.3లక్షలు టోకరా : ఆలయ చైర్మన్ పై మహిళ ఫిర్యాదు

మహిళకు ఆలయంలో జాబ్ ఇప్పిస్తానంటూ మోసం చేయడమే కాకుండా..ఆమెతో వివాహేతర సంబంధం నడిపాడు ఓ ఆలయ చైర్మన్. ఈ విషయాన్ని బయటికి చెబితే రంకు విషయాన్ని అందరికీ చెబుతానని బెదిరించాడు. పోలీసులకు చెప్పినా ఫలితం లేకపోయేసరికి బాధిత మహిళ మీడియాకు అసలు విషయం చెప్పడంతో చైర్మన్ బాగోతం బయటపడింది.

వివరాల్లోకెళతే.. కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలకేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ చైర్మన్‌ గా ఎక్కటి సంజీవరెడ్డి కొనసాగుతున్నాడు. మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటికి కల్లు తాగేందుకు వెళ్లేవాడు. ఈ క్రమంలో వారిమధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. తనకు అధికారులు, బడా నాయకులు తెలుసని మహిళా భర్తకు ఉద్యోగం కల్పిస్తానని నమ్మించాడు. ఆ మాటలు నమ్మిన మహిళ  రెండేళ్లక్రితం వారికున్న 20 గుంటల భూమిని అమ్మగా వచ్చిన రూ.మూడు లక్షలు సంజీవరెడ్డికి ఇచ్చింది. రెండేళ్లయినా ఉద్యోగం కల్పించకపోవడంతోపాటు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా.. తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని అందరికీ చెబుతానని తీవ్రంగా కొట్టాడు.

ఆ సమయంలో అడ్డుగా వచ్చిన ఆమె భర్తపైనా దాడికి పాల్పడ్డాడు. తన మాట వినాలని, లేకుంటే తన మనుషులతో చంపిస్తానని బెదిరించాడు. ఈ విషయమై స్థానికంగా కొద్దిరోజులుగా పంచాయితీలు కూడా నడుస్తున్నట్లు సమాచారం. ఇదే విసయంపై తనపై, తన భర్తపై దాడి చేశాడని మహిళా న్యాయం కోసం ఇల్లందకుంట పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు కనీసం పట్టించుకోలేదు. మీడియా సపోర్ట్ తో ఎస్సై నరేశ్‌ కుమార్‌ను వివరణ కోరగా.. సంజీవరెడ్డి వివాహేతర సంబంధం నెరుపుతున్నట్లు.. డబ్బులు కూడా ఇచ్చేది ఉన్నట్లు సదరు మహిళ ఫిర్యాదు చేయడానికి వచ్చిందని, పూర్తి సమాచారం తెలుసుకునేందుకే కొంత సమయం తీసుకున్నానని, ఫిర్యాదును మార్చాలని తాను మహిళపై ఒత్తిడి తేలేదని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తామని తెలిపారు పోలీసులు.

 

 

Posted in Uncategorized

Latest Updates