ఉద్యోగాల పేరుతో కుంభకోణం : సీఎం కార్యదర్శి సంతకం ఫోర్జరీ

fotజూనియర్ అసిస్టెంట్‌ గా తెలంగాణ సచివాలయంలో ఉద్యోగం వచ్చిందంటూ ఫేక్ అపాయింట్ మెంట్ ఆర్డర్ తో శనివారం(జులై-7) సాయంత్రం ఓ మహిళ సచివాలయానికి  వచ్చింది. అయితే అపాయింట్‌మెంట్ ఆర్డర్‌ లో సీఎం ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి పేరుతో ఫోర్జరీ సంతకం ఉండటాన్ని అధికారులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని  చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఆయన సూచన మేరకు సీఎస్ కార్యాలయం సిబ్బంది ఈ విషయంపై సైఫాబాద్ పోలీసులకు కంప్లెయింట్ చేశారు.
విజయవాడకు చెందిన ఎస్.నాగమణి (28) బీకాం పూర్తిచేసింది. తన తల్లితో కలిసి హైదరాబాద్ కూకట్ పల్లిలో నివాసముంటుంది. అదే ఏరియాలో ఉంటున్న ప్రేమ్ సాగర్ అనే వ్యక్తితో యువతి తల్లికి పరిచయం ఏర్పడింది. బీకాం పూర్తి చేసిన తన కూతురికి ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని అతడిని కోరింది. తనకు రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయిలో చాలా పరిచయాలు ఉన్నాయని, గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని వారిని నమ్మించిన ప్రేమ్ సాగర్ నాగమణి తల్లి దగ్గర నుంచి రూ.6లక్షలు తీసుకొన్నాడు. రెండు రోజుల క్రితం నాగమణి పేరుతో ఓ నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్‌ ను రెడీ చేసి దానిపై సీఎం ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి నాగమణి చేతికి ఇచ్చాడు. దీంతో రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు తనకు అపాయింట్‌మెంట్ ఆర్డర్ వచ్చిందంటూ శనివారం నాగమణి సచివాలయం అధికారులను కలిసింది. అక్కడ విషయం కాస్తా బయటపడటంతో తాను మోసపోయానని, తనకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ ప్రేమ్‌ సాగర్ మోసం చేశాడంటూ ఆమె అధికారులకు విన్నవించింది. దీంతో ఆమె సైఫాబాద్ పోలీసులు ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై ప్రేమ్‌ సాగర్‌ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమే సాగర్ భాధితులు ఇంకా ఉన్నారా, ప్రేమ్ సాగర్ వెనుక ఉండి ఎవరైనా ఇదంతా నడిపిస్తున్నారా అన్న విషయంపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates