ఉద్యోగుల శ్రమతోనే ప్రభుత్వ పథకాలు విజయం: సీఎం కేసీఆర్

cm-kcr
ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంజినీర్ల, ఉద్యోగుల విశేష కృషి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకుల సమస్యలపై సీఎం కేసీఆర్ మంత్రి వర్గ ఉపసంఘంతో ప్రగతి భవన్‌లో చర్చించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెవెన్యూ పెరుగుదల అద్భుతంగా ఉందన్నారు. వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చించిందన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామన్న సీఎం .. ఉద్యోగుల శ్రమతోనే ప్రభుత్వ పథకాలు విజయవంతమయ్యాయన్నారు.

రెవెన్యూ వసూళ్లలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు సీఎం కేసీఆర్. రెవెన్యూ రికార్డులను విజయవంతంతగా ప్రక్షాళన చేశామన్నారు. తెలంగాణ అభివృద్దిలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదన్నారు. దేశస్థాయిలో రాష్ట్రానికి ఎంతో గౌవరం దక్కుతోందన్నారు. కేసీఆర్ కిట్ల వల్ల ప్రభుత్వ డాక్టర్లు ఎంతో శ్రమిస్తున్నారని.. బాధ్యత పెరిగిందన్నారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యతన్నారు. జూన్ 2న ఇంటీరియమ్ రిలీఫ్ ప్రకటిస్తామన్నారు. ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. బదిలీల విధివిధానాలపై అజయ్ మిశ్రా అధ్యక్షతన కమిటీ వేశామన్నారు. పంచాయతీ ఎన్నికల ముందే ఉద్యోగుల బదిలీలు చేపడతామన్నారు. రెండు..మూడు రోజుల్లో పీఆర్సీపై త్రిసభ్య కమిటీ వేస్తామన్నారు. ఆగస్టు 15కు ముందే పీఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించామన్నారు.

సీపీఎస్ పై అనుమానాలున్నాయని… రాష్ట్ర ప్రభుత్వం తరుపున డెత్ కం గ్రాట్యుటీ చెల్లిస్తామన్నారు. జోనల్ విధానంపై కేబినెట్ ఫైనల్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. శాశ్వత బదిలీల విధానం తయారు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారన్నారు. బదిలీల్లో ఉద్యోగస్తులైన భార్య భర్తలను ఒకే చోటకు తెచ్చేలా చేయాలని ఆదేశాలిచ్చామన్నారు సీఎం.

టీచర్ల ఏకీకృత సర్వీసుల కోసం ప్రభుత్వమే న్యాయ పోరాటం చేస్తుందన్నారు సీఎం కేసీఆర్. అంతేకాదు పది రోజుల్లోనే కారుణ్య నియామకాలు చేపడతామన్నారు. పకడ్బందీగా ఉద్యోగుల హెల్త్ స్కీమ్ అమలు చేస్తామని..దీని కోసం కొత్త పాలసీని రూపొందించే బాధ్యత ఉద్యోగులకే అప్పగిస్తామన్నారు. ప్రమోషన్ పాలసీని స్పష్టంగా రూపొందిస్తామన్నారు. ఉద్యోగుల బదిలీల కోసం తెలంగాణ ట్రాన్స్ ఫర్ పాలసీని చేస్తామన్నారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates