ఉరకలేస్తున్న గోదారమ్మ : తెరుచుకున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు

bablyగోదారమ్మ ఉరకలేస్తోంది. మొన్నటి వరకు ఎండిన నది.. ఇప్పుడు పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ చేయడంతో.. గోదావరి పరుగులు పెడుతోంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఇవాళ్టి నుంచి అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచి ఉంచనున్నారు అధికారులు.
మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను ఓపెన్ చేశారు అధికారులు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అధికారుల సమక్షంలో బాబ్లీ నుంచి నీటిని రిలీజ్ చేశారు cwc అధికారులు. ఉదయం బాబ్లీ 3 గేట్లను మాత్రమే ఎత్తిన అధికారులు.. ఆ తర్వాత మొత్తం 14 గేట్లను పూర్తిగా ఎత్తారు. దీంతో గోదావరికి పెద్దఎత్తున నీరు చేరుతోంది. నిన్నమొన్నటి వరకు ఎడారిని తలపించిన గోదారమ్మ … బాబ్లీ గేట్ల తీయడంతో జలకళ వచ్చింది.
మహారాష్ట్రంలో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం తర్వాత సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. ప్రతి ఏడాది జూలై ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ 28వరకు బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి ఉంచాలని ఆదేశించింది. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు బాబ్లీ ప్రాజెక్టులో స్టోరేజ్ లో ఉన్న 0.56 టీఎంసీల నీళ్లు దిగువకు వదిలేసారు. తెలంగాణ నుండి ఈఈ వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఈఈ మోహన్ రావ్, ఎస్.ఆర్.ఎస్.పి ఈఈ రామారావుతో పాటు మహారాష్ట్ర డిప్యూటీ ఈఈ ప్రశాంత్ కదమ్ హాజరయ్యారు. బాబ్లీ గేట్లు ఓపెన్ కావడంతో బాసర దగ్గర అధికారులు అప్రమత్తమయ్యారు. నీటి ప్రవాహం ఎక్కువ ఉండటంతో.. బోటింగ్ ను నిలిపివేసారు. భక్తులు స్నానాలు చేసే దగ్గర ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. గజ ఈత గాళ్లను కూడా అందుబాటులో ఉంచారు అధికారులు.
గత నెలలో రెండు సార్లు గేట్లను తెరిచింది మహారాష్ట్ర ప్రభుత్వం. జూన్ నెలలో భారీ వర్షాలు కురవడంతో బాబ్లీకి భారీ వరద చేరింది. దీంతో ఆ నీటిని కిందకు వదిలారు. జూన్ నెలలో మూడున్నర టిఎంసిలకు పైగా నీరు … బాసర మీదుగా ఎస్.ఆర్.ఎస్.పి కి చేరింది. బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయిన తర్వాత … తొలిసారిగా జూన్ నెలలో నీటి విడుదల చేశారు.

Posted in Uncategorized

Latest Updates