ఉస్మానియాలో అరుదైన సర్జరీ.. రెండేళ్ల తర్వాత అన్నం తినేలా చేశారు

హైదరాబాద్ : ఓ యువతికి అరుదైన సర్జరీ చేసి సక్సెస్ అయ్యారు ఉస్మానియా హస్పిటల్ డాక్టర్లు. రెండేళ్లుగా నోరు తెరుచుకోకుండా బాధపడుతున్న ఓ యువతికి ప్లాస్టిక్‌ సర్జరీ చేసి సరిచేశారు. గద్వాల్‌ కు చెందిన సావిత్రి (18) మూడున్నర ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడింది. ఈ ఘటనలో ఆమె గడ్డం మీద బలమైన గాయం కావడంతో.. కింది దవడ జాయింట్‌ పై వత్తిడి పడింది.

ఈ ప్రభావం టెంపెర్‌ మాని డిబ్యులార్‌ జాయింట్‌ ఎముకపై పడింది. దీంతో ఆ జాయింట్‌ ఎముక విరిగి పోయి జాయింట్‌ ఫ్యూజ్‌ అయింది. ఎముక గ్యాప్‌ పెరగడంతో.. ఆ యువతి నోరు తెరవలేని పరిస్థితి ఏర్పడింది. రెండేళ్లుగా ఆమె ద్రవ పదార్థాల మీదే ఆధారపడింది. ఆమెను తల్లిదండ్రులు ఉస్మానియా హస్పిటల్ కి తీసుకొచ్చారు. ప్లాస్టిక్‌ సర్జన ప్రొఫెసర్‌ డాక్టర్‌ పలుకూరి లక్ష్మి ఆమెకు పరీక్షలు నిర్వహించి సర్జరీ చేసి సరిచేయాలని నిర్ణయించారు. ఎముకలో ఏర్పడిన వ్యర్థాలను తొలగించారు. యాక్రిలిక్‌ బాల్‌ను విరిగిన ఎముక జాయింట్‌లో అమర్చి మూసుకుపోయిన నోటిని యథావిధిగా తెరుచుకునేలా సర్జరీ చేశారు. ఇప్పుడు ఆ యువతి అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవచ్చునని తెలిపారు డాక్టర్లు.

ఈ తరహా సర్జరీకి కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అయిదారు లక్షలు అవుతుందన్నారు. ఆరు గంటల పాటు జరిగిన ఈ సర్జరీలో డాక్టర్లు కిరణ్‌ బలిరాం, రమ, హరీస్‌, కల్పన, వీణా, కీర్తన, తనూజ, అక్షయ్‌, అనుపమ, పతాంజలి తదితరులు పాల్గొన్నారు. సర్జరీని సక్సెస్ చేసినందుకుగాను డాక్టర్స్ టీమ్ ను అభినందించారు హస్పిటల్ సూపరింటెండెంట్‌. తమ బిడ్డకు ఆపరేషన్ సక్సెస్ కావడంతో సంతోషం వ్యక్తం చేశారు సావిత్రి తల్లిదండ్రులు. రెండు సంవత్సరాల తర్వాత తమ బిడ్డ అన్నం తింటుందని.. సర్జరీ చేసిన డాక్టర్లకు థాంక్స్ చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates