ఊరి పేర్లే కలిపాయి : తప్పిపోయిన కొడుకు ఎనిమిదేళ్లకి తిరిగొచ్చాడు

ఆ అబ్బాయి పేరు శ్రీకాంత్. వయస్సు ఎనిమిదేళ్లు. ఆ వయస్సులో తల్లిదండ్రుల పేర్లు కంటే.. అమ్మ, నాన్న ఇలా గుర్తు ఎక్కువగా ఉంది. అలాంటి వయస్సు అది. ఆ వయస్సులో తప్పిపోయిన శ్రీకాంత్.. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఇంటికి తిరిగి రావటం ఆ కుటుంబంలో ఆనందం నింపింది. అంతే కాదు.. ఇక్కడ ఓ విశేషం ఉంది. శ్రీకాంత్ ఏమీ గుర్తుకులేకపోయినా  అతని ఊరిపేరుతోపాటు అత్తయ్య గ్రామం పేర్లు గుర్తుండటమే మళ్లీ తిరిగి రావటానికి కారణం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా ఖిల్లాఘనపూర్‌ మండలం షాపూర్‌ గ్రామానికి చెందిన వేముల రాములమ్మ, వెంకటయ్య బతుకుదెరువు కోసం 8 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒకే కుమారుడు. శ్రీకాంత్ అల్సర్‌తో బాధపడుతుండడంతో 2010లో ఆపరేషన్ చేయించారు. చదువుపై శ్రద్ధ పెట్టాలని తల్లిదండ్రులు తిట్టారు. దీంతో ఇంట్లో అలిగి వెళ్లిపోయాడు. కొత్తగా హైదరాబాద్ సిటీకి రావటంతో మళ్లీ వద్దాం అన్నా అడ్రస్ తెలియక ఎటో వెళ్లిపోయాడు. ఆ తర్వాత చర్లపల్లి ప్రాంతంలో తిరుగుతున్న శ్రీకాంత్ ను.. అధికారులు దివ్యదిశ ఆశ్రమానికి తరలించారు. అక్కడి నుంచి చర్లపల్లి బెథాని సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత మెదక్‌ జిల్లా దొంతిలోని సాజీవర్గీస్‌ బెథాని సంరక్షణ కేంద్రంలో చదువుకున్నాడు. ఇటీవలే 10వ తరగతి పరీక్షలు రాశాడు కూడా. అయితే కన్నవారిని కలుసుకోవాలనే కోరిక మళ్లీ పుట్టింది. తల్లిదండ్రుల పేర్లు తెలియవు.. ఎక్కడ ఉంటారో కూడా తెలియదు.. ఒక్కటి మాత్రం గుర్తు ఉంది. అయితే అది కూడా కరెక్టా కాదా అనేది మాత్రం తెలియదు. ఓసారి ప్రయత్నించి చూద్దాం అనుకున్నాడు శ్రీకాంత్. ఆ వెంటనే.. సంరక్షణ కేంద్రం అధికారులతో మాట్లాడాడు.

అతడికి గుర్తున్నది ఘనపురం అనే గ్రామం పేరు మాత్రమే. వెంటనే అధికారులు గూగుల్ లో సెర్చ్ చేశారు. ఘనపురం పేరుతోపాటు ముందూ వెనకా కొన్ని పేర్లతో ఉన్న ఊర్లు చాలా వచ్చాయి. పేర్లతోపాటు మ్యాప్ లు పరిశీలించారు. ఈ క్రమంలోనే మానాజీపేట అనే పేరు కూడా ఎక్కడో విన్నట్లు అనిపించింది శ్రీకాంత్ కు. ఘనపురం, మానాజీపేట గ్రామాల్లో విచారిస్తే విషయం తెలుస్తుంది కదా అని భావించిన అధికారులు.. వెంటనే ఘనపురం పేరుతో ఉన్న గ్రామాల్లో విచారణ చేపట్టారు. అదే విధంగా మానాజీపేటలో విచారణ చేశారు. ఆ గ్రామంలోని శ్రీకాంత్ మేనత్త.. చిన్నారిని గుర్తించింది. వెంటనే వనపర్తి జిల్లా ఖిల్లాఘనపూర్‌ మండలం షాపూర్‌ గ్రామంలో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

కలలో కూడా చూస్తామని అనుకోలేదని.. పిల్లాడుగా తప్పిపోయిన కుమారుడు చెట్టంత అయ్యి కళ్ల ఎదుట కనిపిస్తే ఇంత కంటే ఆనందం ఏముంటుందని అంటున్నారు ఆ కన్నోళ్లు. బెథాని సంరక్షణ సమితి నిర్వాహకులు, బాలవికాస్‌ సభ్యులు కైలాశ్‌, ఆత్మరాములు, బాలల సంరక్షణ అధికారి రామకృష్ణలు ఫార్మాల్టీస్ పూర్తిచేసి శ్రీకాంత్‌ను తల్లిదండ్రులకు అప్పగించారు. కథ సుఖాంతం అయ్యింది.

 

Posted in Uncategorized

Latest Updates