ఎంత ఘోరం : రైలు పట్టాలపై కూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి

bridgeముంబై లో పాతకాలం నాటి బ్రిడ్జి ఒకటి కూలిపోయింది. తూర్పు-పశ్చిమ అంధేరీ ప్రాంతాలను కలిపే గోఖలే బ్రిడ్జ్ కొంత భాగం కూలిపోయింది. అంధేరీ రైల్వే స్టేషన్ కు దగ్గర్లో రైలు పట్టాలపైనే పడిపోవటంతో రైల్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావడంతో.. దానిపై నడుస్తున్నవారు కిందపడిపోయారు.ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

మంగళవారం(జులై-3) ఉదయం 7.30 నిమిషాలకు బ్రిడ్జ్ కూలింది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. వర్షాల వల్లే బ్రిడ్జ్ కూలినట్లు చెబుతున్నారు అధికారులు. రైలు పట్టాలపై బ్రిడ్జ్ కూలడంతో ట్రాక్ ధ్వంసం అయింది. ముంబై ఫైర్ బ్రిగేడ్ కు చెందిన నాలుగు ఫైర్ టెండర్లు స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేస్తున్నాయి. NDRF, రైల్వే పోలీస్ ఫోర్స్, గవర్నమెట్ రైల్వే పోలీస్ సిబ్బంది కూడా స్పాట్ కు చేరుకుని పనులు మొదలు పెట్టారు. పట్టాలపై నుంచి శిథిలాలను తొలగిస్తున్నారు. పూర్తిగా క్లియర్ చేసేందుకు నాలుగైదు గంటల సమయం పడుతుందన్నారు అధికారులు.

రైల్వే ట్రాక్ పై బ్రిడ్జ్ కూలడంతో.. హార్బర్ లైన్ కు వెళ్లే రైళ్లపై ప్రభావం పడింది. అంధేరీ – బాంద్రా మధ్య రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే ట్రాఫిక్ ను ఇతర రూట్లలో మళ్లించారు. అంధేరీ నుంచి రైళ్లను ఘాట్కోపర్ వైపు మళ్లించారు. అటు నుంచి ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లేలా ఏర్పాటు చేశారు. బాంద్రా-CST మధ్య పరిస్థితి నార్మల్ గా ఉందని రైల్వే అధికారులు తెలిపారు. చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ రూట్ ను క్లియర్ చేశారు.

గోఖలే బ్రిడ్జ్ కూలిన ఘటనపై ముంబై పోలీస్ కమిషనర్, బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ మేయర్లతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడారు. ట్రాఫిక్ స్మూత్ గా మూవ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ను ఆదేశించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా బస్సుల సంఖ్యను పెంచాలని మేయర్ కు సూచించారు ఫడ్నవిస్.

Posted in Uncategorized

Latest Updates