ఎక్స్‌‌‌‌ట్రా ట్రైన్లు కావాలి.. అయ్యప్ప భక్తులకు కష్టాలు

  • ఎక్స్‌‌‌‌ట్రా ట్రైన్స్ నడపని రైల్వే శాఖ
  • చివరి క్షణంలో హడావుడిగా ప్రత్యేక రైళ్ల ప్రకటన
  • టిక్కెట్లు దొరక్క ట్రావెల్‌ ఏజెంట్లను ఆశ్రయిస్తున్న భక్తులు

 

హైదరాబాద్, వెలుగుః అయ్యప్ప భక్తులకు ఈ ఏడాది కూడా ట్రైన్ కష్టాలు తప్పేలా లేవు. శబరిమల వెళ్లేందుకు కావాల్సినన్ని రైళ్లు అందుబాటులో ఉంచడంలో రైల్వే శాఖ విఫలమవుతోంది. ఏటా తెలంగాణ నుంచే దాదాపు 7 నుంచి పది లక్షల వరకు అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్తుంటారు. డిసెంబర్ నుంచి జనవరి 15 వరకు వీరు ప్రయాణం చేస్తుంటారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఒక్క ట్రైన్ మాత్రమే రెగ్యులర్ గా వెళ్తుండటంతో ఆ ట్రైన్ లో టిక్కెట్లు ఫిబ్రవరి వరకు బుక్ అయిపోయాయి. వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత ఉంది. దీంతో చాలా మంది అయ్యప్ప భక్తులు అసలు రైళ్ల వైపే చూడటం లేదు. ప్రత్యేకంగా వాహనాలు, అద్దె బస్సులు ఇతర ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఎంచుకుంటున్నారు. కానీ రైళ్లలో ప్రయాణంతో పోల్చుకుంటే వీటిలో ఖర్చు,రిస్కూ ఎక్కువే.

ఏటా లక్షల సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్తుంటారని తెలిసినప్పటికీ రైల్వే అధికారులు మాత్రం ఆ దిశగా ఏర్పాట్లు చేయడం లేదు. ఇటీవలే రెండు రాష్ట్రాలకు కలపి 90 ప్రత్యేక రైళ్లను నడుపుతామని చెప్పినప్పటికీ ఇవి సరిపోని పరిస్థితి. పైగా హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే రైళ్లు 15 మించి లేవు. విజయవాడ, కాకినాడ, విశాఖ పట్నం లాంటి ప్రాంతాల నుంచి శబరిమలకు రైళ్లు వెళ్తుండటంతో ఈ ట్రైన్స్ అన్ని అక్కడే బుక్ అయిపోతున్నాయి. దీంతో సిటి నుంచి వెళ్లే వారికి అసలు సీట్లు ఉండడం లేదు.

హడావుడిగా అదనపు ట్రైన్ల ప్రకటన

ఏటా అయ్యప్ప భక్తుల రద్దీ ఉంటుందని తెలిసినప్పటికీ అందుకు తగిన ప్రణాళిక మాత్రం రైల్వే అధికారుల వద్ద ఉండటం లేదు. డిసెంబర్ రెండో వారం నుంచి జనవరి 15 వరకు ట్రైన్స్ అవసరానికి తగిన విధంగా ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు ఉండటం లేదు. జనవరి 5 నుంచి రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో పది రోజుల కోసం ప్రత్యేక రైళ్లను అప్పటికప్పడు ప్రకటిస్తున్నారు. అప్పటికే చాలా మంది అయ్యప్ప భక్తులు శబరి వెళ్లేందుకు ఇతర రవాణా మార్గాలను సిద్ధం చేసుకుంటున్నారు. పైగా అప్పటికప్పుడు ప్రకటించే ట్రైన్ల కారణంగా టిక్కెట్ల బుకింగ్ కూడా చాలా మంది కి కష్టమవుతోంది. గతేడాది కూడా ఇదేవిధంగా మకర జ్యోతి దర్శనం సందర్భంగా కొన్ని ప్రత్యేక రైళ్లను నడిపించారు. వీటిలో టిక్కెట్ లు దక్కించుకునేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పైగా నిర్ణీత సమయానికి వెళ్లాల్సిన ట్రైన్స్ చాలా ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో అయ్యప్ప భక్తులు అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేక రైళ్లలో ఏ మాత్రం సదుపాయాలు కల్పించలేదు. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొనైనా ఈ ఏడాది అదనపు రైళ్లను నడిపించాలని అయ్యప్ప భక్తులు డిమాండ్ చేస్తున్నారు. డిసెంబర్ రెండో వారం నుంచే అదనపు రైళ్లను అందుబాటులో తెస్తే అటు రైల్వే శాఖకు ఆదాయంతో పాటు ఇటు అయ్యప్ప భక్తులకు మేలు జరుగుతుందని చెప్తున్నారు.

టిక్కెట్ల బుకింగ్ లో దళారుల దందా

అయ్యప్ప భక్తుల కోసం అదనంగా ఏర్పాటు చేస్తున్న కొద్దిపాటి రైళ్లు కూడా దళారులకే మేలు చేస్తున్నాయి. ప్రత్యేక రైళ్లలో టిక్కెట్ల కోసం చాలా మంది వీరినే ఆశ్రయించాల్సి వస్తోంది. ఒక్కొక్కరు పలు ఫేక్ ఐడీలను క్రియేట్ చేస్తూ భారీ ఎత్తున టిక్కెట్లను బుక్ చేస్తున్నారు. రెండు నెలల క్రితమే ఇలాంటి ముఠాను రైల్వే ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఈ దందా మాత్రం ఆగడం లేదు. రైళ్లలో ప్రయాణం అనుకూలంగా ఉండటంతో పాటు ధర తక్కువ కావడంతో చాలా మంది దళారులను ఆశ్రయిస్తున్నారు. కొంత మంది రైల్వే టిక్కెట్ కన్నా రెట్టింపు వసూలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఏజెంట్లను పెట్టి దందా షూరు చేశారు. ఐతే వీరిని పట్టుకునేందుకు సరైన నిఘా  కూడా లేదు. రద్దీ అనుగుణంగా రెండు నెలల ముందే రైళ్లను ప్రకటిస్తే టిక్కెట్ల బుకింగ్ కూడా సులభమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Posted in Uncategorized

Latest Updates