ఎనీ టైమ్.. ఎనీ ప్లేస్… మహిళలకు రక్షణ! ఉమెన్ పోలీస్ ఆన్ వీల్స్

హైదరబాద్ లో మహిళల రక్షణ కోసం మహిళా కానిస్టేబుల్ పెట్రోలింగ్ బృందాలు వచ్చాయి. హైదరాబాద్ కోఠి మహిళ కాలేజీలో ఉమెన్ పెట్రోల్ స్క్వాడ్ అయిన “ఉమెన్ ఆన్ వీల్స్” ను ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్, ఏసీపీ డాక్టర్ చేతన జెండా ఊపి ప్రారంభించారు. షి టీమ్స్ కు అనుబంధంగా పనిచేసేలా.. 20 టీమ్స్ ను సిటీ పోలీసులు ప్రారంభించారు. మేల్ పోలీస్ తో పోటీగా పనిచేసేందుకు ఫిమేల్ పోలీస్ కు ఇదో అవకాశం అని క్రైమ్స్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ షికా గోయెల్ చెప్పారు. “ఉమెన్ ఆన్ వీల్స్” బృందాలకు 47మంది పోలీస్ ఆఫీసర్లు ట్రైనింగ్ ఇచ్చారని అన్నారు.

కొత్తగా కానిస్టేబుళ్లుగా ఉద్యోగంలో చేరిన మహిళా పోలీసులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఈ విధులను అప్పగించారు. హైదరాబాద్ లో పోలీస్ ఆన్ వీల్స్ పేరుతో పోలీస్ మెన్ స్క్వాడ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీనిలాగానే…. ఉమన్ ఆన్ వీల్స్ పేరుతో మహిళా పోలీస్ స్క్వాడ్ ను ప్రారంభించారు. మహిళలు తమ సమస్యలను కంట్రోల్ రూమ్ కు తెలిపితే.. వెంటనే బైక్ పై మహిళా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుంటారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా బైక్ డ్రైవింగ్ శిక్షణ తీసుకున్న మహిళా పోలీసుల సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు ఉన్నత అధికారులు చెప్పారు. కోఠిలో ఉమన్ ఆన్ వీల్స్ తో ప్రదర్శన నిర్వహించారు.

మహిళా పోలీస్ బైక్ రైడర్స్.. పగలు, రాత్రి మహిళలకు అండగా ఉండి… అవసరమైతే వారిని గమ్య స్థానాలకు చేర్చడంలో సహకరిస్తారు. సిటీలో డివిజన్ కు ఒక బృందం చొప్పున పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. నేరాలు అదుపుచేయడం.. అత్యవసర సమయంలో స్పందించడం… కమ్యూనిటీ పోలిసింగ్… నేరాల్లేని సమాజ నిర్మాణంపై అవగాహన పెంచడం.. ఇలాంటి లక్ష్యాలతో ఈ టీమ్స్ పనిచేస్తుంటాయి.

Posted in Uncategorized

Latest Updates