ఎన్నికల్లో ఈవీఎంలు వాడొద్దు : ఈసీని కలవనున్న విపక్షాలు

సాధారణ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వస్తున్నాయి. మరోసారి విక్టరీ ఖాయం అని అధికార బీజేపీ బల్లగుద్ది చెబుతున్న సమయంలో…బీజేపీకి పుల్ స్టాప్ పెట్టేందుకు విపక్షాలు కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే…2019 సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లు వాడాలని ఎన్నికల సంఘాన్ని కోరనున్నాయి విపక్షాలు. దేశంలోని 17 రాజకీయపార్టీలు దీనికి సంబంధించి ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియాను  కలవనున్నాయి. NRC ఇష్యూ సందర్భంగా ఢిల్లీ వెళ్లిన మమతాబెనర్జీ బుధవారం(ఆగస్టు-1) కాంగ్రెస్ చైర్ పర్సన్ సోనియా గాంధీ, అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసారు. ఈ భేటీ సమయంలో మమతాబెనర్జీ బ్యాలెట్ పేపర్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మమత ప్రతిపాదనను ఇప్పుడు బీఎస్పీ, ఆప్, ఎస్పీ, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎమ్, టీడీపీ, జేడీఎస్, డీఎంకే, వైసీపీ, ఎన్సీపీ తదితర పార్టీలు అంగీకరిస్తున్నాయి. ఈవీఎమ్ లకు బదులుగా ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు వాడాలని శివసేన కూడా మమత ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. గతంలో ఆప్, బీఎస్పీ తదితర పార్టీలు ఈవీంలలో ఏ బటన్ ప్రెస్ చేసినా… అది బీజేపీ గుర్తుకే వెళ్తుందని, ఈవీఎంలను బీజేపీ ట్యాంపరింగ్ చేస్తుందని ఆరోపించిన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates